మన తెలంగాణ/సికింద్రాబాద్: నిరుద్యోగ యువత నేతల అరెస్టులతో గాంధీ ఆసుపత్రి ఉద్రిక్తంగా మారింది. గత 8 రోజులగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జెఎసి నాయకుడు మోతీలాల్ నాయక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి అరెస్టు చేస్తారన్న సమాచారంతో సోమవారం ఉదయం నుంచి విద్యార్థ్దులు, నిరుద్యోగ యువత, పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆసుపత్రికి తరలి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ స్థాయిలో ఆసుపత్రి ప్రాంగణంలో మోహరించారు. దీంతో అటు పోలీసులు ఇటు నిరుద్యోగ యువతతో ఆసుపత్రి ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. నిత్యం గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగులు భయాందోళనకు గురయ్యారు. తూర్పు మండల డిసిపి గిరిధర్ ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు గాంధీ ఆసుపత్రికి చేరుకొని నిరుద్యోగ యువత, బిఆర్‌ఎస్ నాయకులను అడ్డుకొని వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు వ్యాన్‌లలో బలవంతంగా తరలించారు.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను గాంధీ ఆసుపత్రి నుంచి వేరే ఆసుపత్రికి తరలిస్తారని తెలుసుకున్న విద్యార్థులు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారిని ఆసుపత్రి లోపలికి రానియ్యకుండా పంపివేశారు.. మీడియాను సైతం లోపలికి పంపకుండా పోలీసులు అడ్డుకున్నారు. మోతీలాల్ నాయక్‌ను పరామర్శించడానికి వచ్చిన జనగామ ఎంఎల్‌ఏ పల్ల్లా రాజేశ్వర్ రెడ్డి, నిరుద్యోగ సమాఖ్య నేత రాజారాం యాదవ్‌లు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. తాము శాంతియుతంగా మోతీలాల్‌ను పరామర్శించడానికి వస్తే పోలీసులు దౌర్జన్యంగా తమను అడ్డుకుని , ఈడ్చుకుంటూ బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపెట్టిన కాంగ్రెస్ నాయకులు గద్దెనెక్కిన తరువాత నిరుద్యోగుల సమస్యలను పక్కన పెట్టి తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతను జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. తమ డిమాండ్ల కోసం 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయిన లేదన్నారు.
వెంటనే ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ యువత డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోతీలాల్ నాయక్‌కు ఏమైనా జరిగితే రెవంత్ రెడ్డి సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నిరుద్యోగులకు అండగా బిసి సమాఖ్య పోరాటం చేస్తుందని వారు తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామి ఊదరగొట్టిన రాహుల్ గాంధీ ఎక్కడ అని ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.