పరిహారం ఇచ్చిన తరువాతే పనులు
మొదలుపెట్టాలని రైతుల నిరసన
రైతులను బలవంతంగా ఈడ్చుకెళ్లిన
పోలీసులు న్యాయం కోసం
పురుగుల మందు తాగి మహిళ
ఆత్మహత్యాయత్నం పోలీసు
బందోబస్తు నడుమ జెసిబితో
కాలువ పనులు
తమకు నష్టపరిహారం ఇచ్చిన తరువాతనే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ పనులు మొదలు పెట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం, ఎల్కేశ్వరం గ్రామ రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులతో గ్రామ రైతులు వాగ్వాదానికి దిగడంతో వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. చిన్న కాళేశ్వరం కెనాల్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూ నిర్వాసితుల్లో ఒకరు రాళ్ల బండి కమల అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తమ భూమిలో నుంచి కెనాల్ వెళ్లడం వల్ల తమకు నష్టపరిహారం ఇవ్వకుండా పోలీసులను పెట్టి పనులు చేస్తున్నారని వాపోయింది. ఈ విషయమై నాలుగు రోజుల నుంచి అడ్డుకుంటున్నా పట్టించుకువారు లేరని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగినట్లు ఆమె బంధువులు తెలిపారు.
మరొక రైతు రాళ్లబండి రాజేందర్ ..తమ నాన్న సంపాదించిన 20 గుంటల భూమి కాల్వలోనే పోతోందని, కానీ తనకు ఎలాంటి సమాచారం అధికారులు ఇవ్వలేదని, నష్టపరిహారం రాలేదని ఇదేంటని అడిగినందుకు పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి పోలీసు వాహనంలో ఎక్కించడానికి ప్రయత్నించారని వాపోయాడు. పోలీసు వాహనానికి అడ్డంగా పడుకొని తన బాధను వెలిబుచ్చాడు. నష్టపరిహారం ఇవ్వకుండా భూములను ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెబుతూ.. నాతో పాటు 10 మంది రైతులు బాధితులుగా ఉన్నారని తెలిపాడు. ఇప్పటివరకు తమకు ఎలాంటి నష్టపరిహారం రాలేదని, వచ్చిన తరువాతనే పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేశాడు. అదేవిధంగా సర్వేలో కాలువ అప్పుడు 20 మీటర్లు అని ఇప్పుడు 40 మీటర్లకు పెంచారని, దీంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరాడు.