Thursday, January 23, 2025

షాహీన్‌బాగ్ కూల్చివేతకు బుల్డోజర్లు : ఢిల్లీలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

Tension Drama Over Bulldozers At Delhi

 

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో వార్తల్లో నిలిచిన ఢిల్లీ లోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సోమవారం దక్షిణ డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎండిసి) చర్యలు ప్రారంభించింది. సోమవారం ఆ ప్రాంతానికి బుల్డోజర్లు రావడంతో భారీ సంఖ్యలో ప్రజలు అడ్డుకుని ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పారామిలిటరీ సిబ్బందిని రంగం లోకి దింపారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గక పోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.

బుల్డోజర్లను అక్కడ నుంచి పంపించేశారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎస్‌ఎండిసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల జహంగీర్‌పురి వద్ద జరిగిన ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని షాహీన్‌బాగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూల్చివేతల కోసం వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. బుల్డోజర్లు, జేసీబీలు రాగానే స్థానికులు , ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మద్దతుదారులు వాహనాలకు అడ్డంగా నిలబడి నిరసన చేపట్టారు. కొంతమంది నిరసన కారులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఆప్ ఎమ్‌ఎల్‌ఎ అమనతుల్లా ఖాన్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను తాము ఇప్పటికే తొలగించామని, అయినా బుల్డోజర్లను పంపించిన బిజేపి రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.

షాహీన్‌బాగ్ కూల్చివేతపై జోక్యం చేసుకోం : సుప్రీం

షాహీన్‌బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకోలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, ఏదైనా ఉంటే ఢిల్లీ హైకోర్టు లోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. షాహీన్‌బాగ్ కూల్చివేతలను నిరసిస్తూ సోమవారం పిటిషన్ దాఖలైంది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. బాధితులు కాకుండా రాజకీయ పార్టీ పిటిషన్ వేయడం ఏంటని, రాజకీయాలకు సుప్రీం కోర్టును వేదికగా చేసుకోవద్దని మందలించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News