Tuesday, January 21, 2025

ఫార్మా…రణం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా, కొడంగల్‌లోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ఉద్దేశించి అధికారులు చేపట్టిన భూసేకరణ ప్రజాభిపాయ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత, రణరంగంగా మారింది. భూ సేకరణ ప్రజాభిప్రాయ కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో సహా పలువురు అధికారులను రైతులు పరుగెత్తించారు. రాళ్ళు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఒక దశలో విచక్షణ కోల్పోయిన రైతులు అధికారులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అధికారుల వాహనాలను రాళ్ళు, కర్రలతో ధ్వంసం చేశారు. తామంతా ఫార్మా కంపెనీల నిర్మాణాలకు వ్యతిరేకమని గత కొంతకాలంగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు భూసేకరణ పేరుతో గ్రామంలోకి రావడం ఏమిటని వారు అధికారులపై తిరగబడ్డారు. రైతుల మూకుమ్మడి దాడితో అధికారులు ఖంగుతిన్నారు. బతుకుజీవుడా అంటూ అక్కడి నుండి తమ వాహనాలలో పరుగులు తీశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీలను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో భాగంగా హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి గ్రామాల్లో 1,354 ఎకరాల్లో ఫార్మా విలేజ్ నిర్మాణానికి భూవివరాలను సేకరించింది. పోలేపల్లిలో 35 మంది రైతులు, హకీంపేట్‌లో 405 మంది రైతులు, లగచర్లలో 564 మంది రైతులు భూమిని కోల్పోతున్నట్లుగా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా సోమవారం లగచర్ల గ్రామ పరిధిలోని 677 ఎకరాల్లో ఉన్న 564 మంది రైతుల నుండి భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా దుద్యాల, లగచర్ల గ్రామాల మధ్యలో దాదాపుగా 250 మంది పోలీసుల పర్యవేక్షణలో భూసేకరణ కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు సిద్ధం చేశారు. కానీ కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడికి చేరుకున్నా రైతులు ఎవరూ ఆ ప్రాంతానికి రాలేదు.

కొంత సమయం తరువాత గ్రామానికి చెందిన కొందరు అక్కడికి చేరుకొని భూసేకరణ కార్యక్రమాన్ని గ్రామంలో భూములు కోల్పోతున్న రైతుల సమక్షంలో నిర్వహించాలని, ఇక్కడ నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. అధికారులు గ్రామంలోకి రావాలని వారు పేర్కొన్నారు. ఆ మాటలను విన్న కలెక్టర్ వారి మాటలను విశ్వసించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని గ్రామంలోనే నిర్వహిద్దామని అధికారులను తీసుకుని గ్రామంలోకి చేరుకున్నారు. కానీ అధికారులు గ్రామంలోకి చేరుకునేసరికి అక్కడ ఉన్న పలువురు స్థానికులు కలెక్టర్ గోబ్యాక్.. సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అధికారులపైకి దూసుకువచ్చారు. తాము రైతులతో ప్రశాంతంగా మాట్లాడడానికి వచ్చామని, ఫార్మా కంపెనీల ఏర్పాటుతో ఈ ప్రాంతానికి రాబోయే లాభనష్టాలను వివరించేందుకే తాము ఇక్కడికి వచ్చామని రైతులకు సర్ది చెప్పేందుకు కలెక్టర్ ప్రయత్నించారు.

కానీ ఎంతకూ శాంతించని రైతులు అధికారులపై దాడికి తెగబడ్డారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన కలెక్టర్ భద్రతా సిబ్బంది ఆయనను కారులో ఎక్కించి సురక్షితంగా గ్రామం నుండి వెలుపలికి పంపించారు. కలెక్టర్ వెంబడి భూసేకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, కొడంగల్ తహసీల్దార్ విజయ్‌కుమార్‌పై రైతులు రాళ్ళు, కర్రలతో దాడికి దిగారు. తహసీల్దార్ విజయ్‌కుమార్ ఎంత వారిస్తున్నా ఆయన ముందే ప్రభుత్వ కారును రాళ్ళు, కర్రలతో ధ్వంసం చేశారు. దాడి జరగకుండా కొంతమంది రైతులు తహసీల్దార్‌ను పక్కకు తప్పించారు. కడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిపై కొంతమంది రైతులు దాడికి పాల్పడ్డారు. దీంతో వారి నుండి రక్షణ కోసం ఆయన పంట పొలాల్లోకి పారిపోవాల్సి వచ్చింది. పంట పొలాల మధ్య నుండి కొందరు గ్రామస్థుల సహకారంతో ఆయన తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్‌పి నారాయణరెడ్డి లగచర్ల గ్రామానికి ప్రత్యేక బలగాలను పంపించారు. దీంతో గ్రామంలో గొడవ కాస్తా సద్దుమణిగింది. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎలాంటి గొడవలు జరుగకుండా ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయవద్దని గత రెండు నెలలుగా తామంతా నిరసనలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫార్మాతో ఇక్కడి నేల, నీరు విషతుల్యమవుతుందని, ఇక్కడ నివసించే ప్రజలు, జంతువులు, పశు పక్షాదుల జీవన ప్రమాణాలపై తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని రైతులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు 80 శాతం మంది రైతులు సన్నద్ధంగా ఉన్నారని, కానీ కొంతమంది కావాలనే రాజకీయం చేస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చిన్న సమస్యను రాజకీయ కోణంలో చూస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే తమపై పులువురు దాడికి పాల్పడినట్లు అధికారులు విశ్వసిస్తున్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ భూసేకరణ కార్యక్రమం అగ్గి రగిల్చిందనే చెప్పవచ్చు.

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News