రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం, లగచర్ల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇండస్ట్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం భూసర్వేకు నిర్ణయించడంతో వివిధ తండాల్లోని గిరిజనులు తమ భూములను ఇచ్చేదే లేదని భీష్మించారు. ప్లకార్డులతో గిరిజనుల నిరసన తెలిపారు. దీంతో అడుగడుగునా పోలీసు బందోబస్తు , పర్యవేక్షన నడుమ అధికారులు సర్వే ప్రారంభించారు. ఇండస్ట్ట్రియల్ కారిడార్ కోసం సమ్మతి తెలిపిన రైతుల భూముల్లోనే సర్వే చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… గత జ్ఞాపకాల కారణమో మరేమో కానీ కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇండస్ట్ట్రియల్ కారిడార్ కోసం అధికారులు చేపట్టిన భూసర్వే పూర్తిగా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్‌లో కొనసాగింది. లగచర్ల ఈ పేరు గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమనే చెప్పవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని నిశ్చయించిన నేపథ్యంలో భూసేకరణ కోసం అధికారులు గ్రామంలోకి వెళ్ళగా వారిపై ఆయా గ్రామాల రైతులు అధికారులపై దాడి చేయడం విదితమే. ఈ దాడుల నేపథ్యంలో లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండాలకు చెందిన పలువురు రైతులపై కేసులు నమోదు కావడం కూడా సంచలనం సృష్టించిన విషయమే. రైతులపైనే కాకుండా రైతులను అధికారులపై దాడికి పురికొల్పాడనే కారణంగా మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డిపై కేసు నమోదు కావడం కూడా తెలిసిందే. ఈ కారణాలతో ప్రభుత్వం ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గింది. ఇండస్ట్ట్రియల్ కారిడార్ పేరుతో నూతనంగా మళ్లీ భూసేకరణకు నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా దుద్యాల మండలంలోని పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండాలలో ఉన్న అసైండ్ భూముల సేకరణకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండాలలో సర్వే నంబర్లు 102, 117, 120, 121లలో 110 ఎకరాల 32 గుంటల అసైండ్ భూముల సేకరణ కోసం అధికారులు ఆయా గ్రామాలకు చేరుకున్నారు. గత అనుభవాల నేపథ్యమో మరేదో కానీ భూసర్వేకు అధికారులు దాదాపుగా 200 మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భూసేకరణ సర్వేకు ఆయా గ్రామాలలోకి వెళ్ళిన అధికారులకు తండాలలోని రైతులు, మహిళల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మహిళలు తమ భూములను ఎట్టి పరిస్థితులలో కంపెనీలకు ఇచ్చేది లేదని ప్లకార్డులను ప్రదర్శించారు. గతంలో అక్రమంగా అరెస్టులు చేసి తమ వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని వారు అధికారులను ఘెరావ్ చేశారు. తమ భూములు ఇవ్వడం కుదరదని అధికారుల ముందు నిరసనకు పూనుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రైతులను మహిళలను శాంతింపజేశారు. అధికారులు సైతం తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్ కోసం స్వచ్ఛందంగా అప్పగిస్తామన్న రైతుల భూములను మాత్రమే సర్వే చేస్తామని,
అంగీకరించిన వారి భూముల జోలికి రాబోమని రైతులకు, మహిళలకు స్పష్టం చేశారు. దీంతో రైతులు శాంతించారు. అనంతరం అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్‌లో రైతుల భూములను సర్వే నిర్వహించారు. తండాలలో ఉన్న మహిళలు. రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్ కుఓసం ఎట్టి పరిస్థితులలో ఇచ్చేది లేదని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడంతో ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లగచర్ల మరోసారి రణరంగంగా మారనుందా అనే అనుమానం కలిగించేలా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అధికారులు ముందు జాగ్రత్తగా వ్యవహరించి గ్రామాలలో అధిక మొత్తంలో పోలీసులను మోహరించడంతో పరిస్థితి కాస్తా మెరుగ్గా మారింది. ఏదేమైనా పోలీసుల పర్యవేక్షణలో అధికారులు భూసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.