న్యూస్ డెస్క్: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఔరంగజేబు, టిప్పు సుల్తాన్‌ను కీర్తిస్తూ కందరు వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడంతో కొల్హాపూర్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళన చేపట్టిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచర్జి చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమీక్షిస్తున్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఫడ్నవీస్ పిలుపునిచ్చారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వెనుక కుట్ర ఉండవచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లు కేబినెట్ మంత్రులు సంభూరాజ్ దేశాయ్, దీపక్ కేసర్కర్ తెలిపారు.