పన్నీర్‌సెల్వంపై బాటిళ్లు విసిరిన ఇపిఎస్ వర్గీయులు
జులై 11న మళ్లీ సర్వసభ్య సమావేశం
చెన్నై : అన్నాడిఎంకెలో “ఏక నాయకత్వం” కోసం పన్నీరు సెల్వం (ఒపిఎస్), పళనిస్వామి (ఇపిఎస్) వర్గాల మధ్య జరుగుతున్న వర్గపోరు స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. పళని స్వామి ఆహ్వానంపై పార్టీ సర్వసభ్య సమావేశానికి పన్నీరు సెల్వం (ఒపిఎస్) హాజరైనప్పటికీ ఇపిఎస్ వర్గీయుల నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. ఇపిఎస్ వర్గీయులు బాటిళ్లు ఆయనపై విసరడమే కాకుండా సమావేశం నుంచి వెళ్లిపోవాలని గొడవ చేశారు. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉండటంతో పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులు సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. పన్నీరు పెల్వం సూచించిన 23 తీర్మానాలు రద్దయ్యాయి. పళనిస్వామికి మద్దతుగా ఆయన వర్గీయులు నినాదాలు చేస్తూ ఆయనను పుష్పకిరీటంతో అలంకరించారు. ఖడ్గం, రాజదండం అందించారు.
సీనియర్ కార్యకర్త, మాజీ మంత్రి వలర్‌మతి పార్టీ సంస్థాపకులు దివంగత ఎంజిఆర్ సినిమాలోని పాటను ఆలపించారు. నాయకుడు ఆవిర్భవిస్తాడని ప్రశంసించారు. ఏకనాయకత్వం డిమాండ్‌తో నిర్వహించిన ఈ సమావేశం పూర్తిగా ఇపిఎస్ పార్టీ సుప్రీం అన్నట్టు పళనిస్వామి మద్దతుదారుల బలాన్ని ప్రదర్శించింది. జులై 11న మళ్లీ సర్వసభ్య సమావేశం జరపాలని అన్నాడిఎంకె నిర్ణయించింది. అదే రోజున కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతానికి మద్రాస్ హైకోర్టు ఈరోజు తెల్లవారు జామున ఇచ్చిన ఆదేశాలు పన్నీర్‌సెల్వానికి ఊరట కలిగించాయి. సమావేశంలో 23 తీర్మానాలపై అన్నాడిఎంకె జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని, ఇతర విషయాలపై చర్చ మాత్రమే జరగాలని మద్రాస్ హైకోర్టు ఈరోజు తెల్లవారు జామున ఆదేశాలిచ్చింది. దీంతో ఈ సమావేశంలో ఏకనాయకత్వంపై నిర్ణయంతీసుకునే అవకాశం లేకుండా పోయింది.
ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
డిఎంకె ను దెబ్బతీయాలనుకున్నవారు ఇప్పుడు తుడిచిపెట్టుకు పోయారని అన్నాడిఎంకె నాయకత్వం సంక్షోభాన్ని ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె చీఫ్ స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పెండ్లి వేడుకలో పాల్గొన్న ఆయన ఎలాంటి తీర్మానాలు లేకుండా ఆ పార్టీ కార్యవర్గ సమావేశం ముగియడాన్ని ప్రస్తావిస్తూ డిఎంకెను నాశనం చేయాలని చూసినవారు చివరకు ఎలా పతనమయ్యారో తాను చెప్పదలుచుకున్నానని పేర్కొన్నారు.