Monday, December 23, 2024

‘బండి’ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్ ః కరీంనగర్ ఎంపి బండి సంజయ్ సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాహిత యాత్ర బిజెపి, కాంగ్రెస్ మధ్య దాడి.. ప్రతి దాడితో ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ ఎంపి బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం కాంగ్రెస్,- బిజెపి నాయకుల మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. బిజెపి ప్రజాహిత యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నారు. అదే స్థాయిలో బిజెపి నాయకులు ప్రతిఘటించడంతో హుస్నాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా హుస్నాబాద్ పట్టణ శివారులో కాంగ్రెస్ కార్యకర్తలు,

అదే సమయంలో బండి సంజయ్‌కి స్వాగతం పలకడానికి బిజెపి నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీస్ అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇరు పార్టీల నాయకులు ఒకరికొకరు దూషించుకోవడంతోపాటు దాడి.. ప్రతిదాడుల సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను నిలువరించి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.ఇదిలావుండగా, తాము చేపట్టిన ప్రజాహిత యాత్రను అడ్డుకుంటే సహించేది లేదని —కరీంనగర్ ఎంపి బండి సంజయ్ హెచ్చరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాహిత యాత్రలో తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు.

మంగళవారం హుస్నాబాద్‌తోపాటు మండల పరిధిలోని రాములపల్లి, మడద గ్రామాల్లో ఆయన ప్రజాహిత యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా చేస్తున్న యాత్రను అడ్డుకోవద్దని కాంగ్రెస్ నేతలకు సూచించారు. తాను ఎవరికీ వ్యతిరేకిని కాదని, ఎవరినీ కించపరుస్తూ మాట్లాడలేదని, అలా ఎవరైనా భావిస్తే తనపై తగిన చర్యలు తీసుకోవచ్చని సవాల్ చేశారు. నియోజకవర్గంలో తమ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే అధికార కాంగ్రెస్ పార్టీ కయ్యానికి కాలు దువ్వుతోందని ఆరోపించారు. లేనిపోని సమస్యలు సృష్టించి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజాహిత యాత్రకు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనేలా అనుమతించాలని పోలీసులను కోరారు. నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాహిత యాత్ర సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అదేవిధంగా స్థానిక పోలీసులు యాత్రకు ఎలాంటి అడ్డంకులు కలుగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News