భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న విద్యార్థులు 400 ఎకరాల్లో చెట్ల నరికివేతను
వ్యతిరేకిస్తూ నిరసన విద్యార్థులపై లాఠీలు ఝుళిపించిన పోలీసులు అదుపులోకి
తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలింపు భావితరాలకు గజం స్థలమైనా మిగల్చరా? కేంద్ర
మంత్రి బండి సంజయ్ ధ్వజం వర్సిటీని కాంగ్రెస్ భ్రష్టు పట్టిస్తోందని ఆగ్రహం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూ నివర్సిటీలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత నెలకొంది. విశ్వ విద్యాలయంలోని భూముల విక్రయించేందుకు ప్రభుత్వం జెసిబిలతో చదును చేసే కార్యక్రమాన్ని ఆదివారం నాడు ప్రభుత్వం చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న యూనివర్సిటీ విద్యార్థులు జెసిబిలను అడ్డుకున్నారు. చెట్లను నరికి వేయవద్దని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల్లో చెట్లను కొట్టివేస్తుండగా అడ్డుపడ్డారు. దీంతో అక్కడికి భారీగా చేరుకు న్న పోలీసులు విద్యార్థుల ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా యూనివర్సిటీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు యూనివర్సిటీ మెయిన్ గేట్‌కు తాళం వేసి, జెసిబిలతో చెట్లను కూల్చివేసి చదును చేశారు. పనులను అడ్డుకున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు భా రీగా మోహరించారు. విద్యార్థులపై లాఠీలు ఝులిపించిన పోలీసులు హాస్టల్ రూముల్లోకి వెళ్లి విచక్షణా రహితంగా దాడి చేసినట్లు తెలిసింది. దీంతో కొం దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు లాక్కుని వెళ్లి పోలీసుల వ్యాన్లలో ఎక్కించారు. ఈ విషయాన్ని విద్యార్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. పోలీసుల తీరుపై మండిపడిన బండి సంజయ్ విద్యార్థులపై లాఠీఛార్జీ అమానుషమని అన్నారు. ప్రభుత్వ భూములను తెగనమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అని ప్రశ్నించారు. రాబోయే భావితరాలకు గజం స్థలం కూడా మిగలకుండా చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల ద్వారా భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని అన్నారు. భూముల రక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులపై దాడి చేయడం అమానుషం అన్నారు. వెంటనే అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.