దేశ ప్రజలకు ఉక్రెయిన్ నేతల భరోసా
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడి చేసే ప్రమాదం లేదని ఉక్రెయిన్ నాయకులు దేశ ప్రజలకు మరోసారి హామీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రమాదం ఉందని మాత్రం అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థలను మరితం బలోపేతం చేసుకోవడానికి మంగళవారం అమెరికా సైనిక పరికరాల దిగుమతికి సైతం ఉక్రెయిన్ పాలకులు అంగీకరించారు. అయితే దాడి చేసే ఉద్దేశం తమకు లేదని ఓ వైపు చెప్తున్న రష్యా, మరో వైపు ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌తో సరిహద్దుల వద్దకు లక్ష మంది సైనికులను తరలించడంతో ఒక వేళ యుద్ధం తప్పకపోతే అందికు సిద్ధంగా ఉండేందుకు అమెరికా, దాని నాటో సభ్య మిత్ర దేశాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య స్థాయిలో ఉన్నతస్థాయి ప్రయత్నాలు చాలా జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు సరికదా ఈ వారంలో ఉద్రిక్తత మరింత పెరిగిపోయింది. దీంతో బాల్టిక్ సముద్ర ప్రాంతంలో తన నిరోధక వ్యవస్థలను మరింతగా బలోపేతం చేస్తున్నట్లు నాటో ప్రకటించగా, అవసరమయితే యూరప్‌లో మోహరించడానికి సిద్ధంగా ఉండాలని అమెరికా 8,500 మంది సైనికులను ఆదేశించింది.
కాగా తాజాగా ఉక్రెయిన్‌లో పాలనాధికారులు మాత్రం అంతా ప్రశాంతంగానే ఉందని చెప్పడానికి ప్రయత్నించారు. పరిస్థితి అదుపులోనే ఉందని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ సోమవారం రాత్రి అన్నారు. రష్యా సైనికులు యుద్ధ గ్రూపులుగా ఏర్పాటు కాలేదని, అంటే ఇప్పటికిప్పుడు వారు దాడి చేయరనేదానికి ఇదే నిదర్శనమని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెంజికోవ్ చెప్పారు. భవిష్యతుల్తలో అలాంటి ప్రమాదం లేకపోలేదని ఆయన అంటూనే ప్రస్తుతానికయితే అలాంటి ప్రమాదం లేదని అన్నారు. ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి కార్యదర్శి ఒలెక్సీ డానిలోవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో వైపు రష్యా కూడా తాము ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నామంటూ పాశ్యాత్య దేశాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. అంతేకాదు అమెరికా ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందంటూ రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మంగళవారం మరోసారి ఆరోపించారు.