Monday, December 23, 2024

ఎమర్జెన్సీ నాటికీ, నేటికీ తేడా?

- Advertisement -
- Advertisement -

‘దేశంలో మైనారిటీలు జీవించవచ్చు. కానీ, రెండవ శ్రేణి పౌరులు గా మాత్రమే జీవించాలి’ అనే వీరసావర్కార్ సిద్ధాంతం ఇప్పుడు అధికారికంగా, అనధికారికంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ దీన్ని సైద్ధాంతికంగా అనుసరించకపోవచ్చు. ఆ రోజు 1975 సెప్టెంబర్ 25వ తేదీన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆవరణలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘ నాయకులుగా ఎన్నికైన అశోక్ లతాజైన్‌ను బహిష్కరించడాన్ని నిరసిస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఆందోళన రెండవ రోజు కూడా కొనసాగుతోంది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి అప్పటికి మూడు నెలలవుతోంది.
ఆ రోజు ఉదయం కొంత మంది స్నేహితులతో కలిసి విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ ముందున్న లాన్‌లో ఉన్నాను. ఒక నల్ల ఎంబాసిడర్ కారొచ్చి మా ముందు ఆగింది. దానిలోంచి ఒక బలమైన వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ‘కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు డి.పి. త్రిపాటినా మీరు’ అని నన్నడిగారు. నేను కాదన్నాను. నా మాటను ఆయన నమ్మలేదు. బహుశా ఆయన రేంజ్ డిఐజి పి.ఎస్. బిందర్ అనే నా అనుమానం.సాధారణ దుస్తుల్లో ఉన్న ఆయన, ఆయన మనుషులు నన్ను పట్టపగలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి జైల్లో పడేశారు.

ఆంతరంగిక భద్రతా చట్టం (మీసా) కింద నన్ను ఏడాది పాటు జైల్లోనే వుంచారు. ఇది జరిగి అయిదు దశాబ్దాలు గడిచిపోయాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2014లో అధికారంలో కొచ్చి, నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా అధికారం చెలాయిస్తున్నారు. వాళ్ళు 2019లో రెండవ విడత కూడా మళ్ళీ అధికారంలోకొచ్చారు. మనకు తెలిసిన, మన మాతృభూమిగా భావిస్తున్న భారతదేశంలో పరిస్థితులు రోజురోజుకూ అనూహ్యంగా మారిపోతున్నాయి. ఆ రోజు 2021 ఫిబ్రవరి 9వ తేదీ నాటి ఉదయం టిఫిన్ చేయడం ముగించుకుని, పేపర్లు చదువుతున్నప్పుడు నా కాలింగ్ బెల్ మోగింది. కొంత మంది మాఇంట్లోకి ప్రవేశించారు. ఒకరి చేతిలో అధికారిక పత్రాలున్నాయి.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి వచ్చామన్నారు.మా ఇంట్లో సోదాలు చేయడానికి వచ్చారు. న్యూస్‌క్లిక్‌పైన దాడి చేయడమే వారి ఉద్దేశం. న్యూస్‌క్లిక్ వెబ్ సైట్ అనే ఒక చిన్న డిజిటల్ ప్లాట్ ఫాంను 2009లో నేను స్థాపించినప్పటి నుంచి పనిలో, పాఠకాదరణలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. మా ఇంట్లో వరుసగా అయిదు రోజులు అంటే 113 గంటలు సోదాలు చేశారు. ఒక ప్రైవేటు ఇంట్లో ఇంత దీర్ఘకాలం సోదాలు జరపడం చాలా అరుదు.

నా వద్ద తీసుకెళ్ళిన సమాచారమంతా రాజమాత గాయత్రీ దేవి కోట జైగర్‌కు తీసుకెళ్ళి పరిశీలించడానికి వారికి పది రోజులు పట్టింది. వాళ్ళు నా ఫ్లాట్‌లో ఇన్ని రోజులున్నా, నిజానికి ఆ పనినంతా అయిదు గంటల్లో పూర్తి చేయవచ్చు. వాళ్ళకొచ్చిన అతిపెద్ద సాంకేతిక సమస్య ఏంటంటే, గూగుల్ నుంచి నాకు సంబంధించిన భారీ సమాచారాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేదే! గూగుల్ నుంచి వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఒక పరిమితికి మించి సాధ్యం కాదు. కొన్ని గంటల తరువాత డౌన్‌లోడ్ విపరీతంగా నిదానమైపోతుంది. నా డిజిటల్ వ్యవస్థ నన్ను ఇబ్బంది పెడుతున్నట్టుగానే ఇడి అధికారులను కూడా ఇబ్బందిపెట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను కానీ, మరే ఇతర ప్రభుత్వ ఏజెన్సీని కానీ ఆదరించడం అంత చిన్న విషయమేమీ కాదు. నేను ఎమర్జెన్సీని ఎదుర్కోవడమనేది జెఎన్‌యులో విద్యార్థుల ప్రతిఘటనతో ముడిపడి ఉంది. ఆ ప్రతిఘటనలో నాతో పాటు డి.పి. త్రిపాటి, అశోక్‌లత(అశోకా అని పిలిచే వాళ్ళం), సీతారాం ఏచూరి వంటి ముఖ్యమైన వారుండేవారు. అప్పటి ఎమర్జెన్సీకి భిన్నమైన ప్రస్తుత ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాను.

వారికి సమస్యగా తయారైన న్యూస్‌క్లిక్ అనేది ఒక చిన్న సంస్థ. బహుశా న్యూస్ క్లిక్‌లో ఉద్యమాల గురించి ఇచ్చే వార్తల స్థాయి గురించి కాదు వారి సమస్య.రైతుల ఆందోళన గురించి న్యూస్‌క్లిక్ విస్తృతంగా ఇచ్చిన వార్తలు దేశ విదేశాలలోని పాఠకులను పెంచింది. న్యూస్‌క్లిక్ మాత్రమే కాదు, ఇతర డిజిటల్ వెబ్‌సైట్లు, ప్రధాన పత్రికా స్రవంతి కూడా వాటికి ప్రాధాన్యతనిచ్చి, ప్రజలపైన జరుగుతున్న దాడులను,వారి జీవనోపాధి కోల్పోవడానికి గల కారణాలను, ఫలితంగా ప్రజల నుంచి వచ్చిన ప్రతిఘటన గురించి రాశా యి. మాలాగానే ఈ పత్రికా కార్యాలయాలు కూడా ప్రభుత్వ కనుసన్నలలోకి వెళ్ళిపోయాయి.
న్యూస్‌క్లిక్ ఎదుర్కొంటున్న వివిధ కేసుల వివరాలలోకి కానీ, పత్రికా రంగాన్ని వేటాడుతున్న ధోరణికి వ్యతిరేకంగా నోరు విప్పిన లోతుల్లోకి కానీ పెద్దగా వెళ్ళదలుచుకోలేదు. చట్టపరమైన విషయాలు కోర్టుల ముందున్నాయి కనుక, వాటిని అక్కడే ఎదుర్కొంటాం. నేను వార్తల్లో ప్రముఖుడిగా కాదలుచుకోలేదు. వార్తలను ఇవ్వడమే న్యూస్‌క్లిక్ బాధ్యత. తొలి నుంచి ఏం చేస్తోందో దానికే పరిమితమవుతున్నాం. క్షేత్రస్థాయిలో ప్రజాఉద్యమాలు ఎలా ఉన్నాయి, మన సమాజంలో చాలా అరుదుగా వినిపించే గొంతులు ఎలా విస్తరిస్తున్నాయో దాన్ని మేం అనుసరించదలుచుకున్నాం.

అప్పటికీ, ఇప్పటికీ ఉన్న ప్రాథమికమైన తేడా సైద్ధాంతికమైనదే. ప్రజల్లో కొందరిని మిగతా పౌరులనుంచి, వారికుండే హక్కుల నుంచి విడదీసి, కొందరిని రెండవ శ్రేణి పౌరులుగా గుర్తించి,వారిని బైటవారిగా చూపించే సిద్ధాంతం కాంగ్రెస్‌కు లేదు. మనం వేటినైతే విద్వేష నేరాలని అంటున్నామో, 2014 నుంచి అవి నాటకీయంగా పెరుగుతున్నాయి. ముస్లింలే ధ్యేయం గా ఈ రకమైన నేరాల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతోంది. దళితులపైన, ఆదివాసీలపైన, మహిళలపైన, లౌకిక వాదులపైన ఈ రకమైన నేరాలు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీలో పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయా? అవును అణచివేత ఉంది కానీ, అది లౌకిక వాద అణచివేత. అవును ఎమర్జెన్సీలో టర్క్‌మెన్ గేట్ ఉదంతం కూడా జరిగింది. అక్కడ వున్న ముస్లింలపై, ఇతర మతస్థులపై దాడి జరిగింది. ఎమర్జెన్సీలో ఒక విషపూరితమైన ఎజెండాకు ఇది ఒక దృశ్యరూపం. వ్యాసెక్టమీ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. నగర సుందరీకరణలో భాగంగా పేదల ఇళ్ళను ధ్వంసం చేశారు. పేదలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని, ఫలితంగా భారత దేశ జనాభా పెరిగిపోయి ప్రపంచ వనరులకు దెబ్బని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను బలవంతంగా చేశారు.

మొత్తంగా ఎమర్జెన్సీ మైనారిటీలను కూడా మినహాయించలేదు. మైనారిటీలను రెండవ శ్రేణి పౌరులుగా చూడడం కాంగ్రెస్ సిద్ధాంతం కాదు. ఆ సిద్ధాంతంపైైన జాతీయోద్యమాన్ని నిర్మించలేదు. ఎమర్జెన్సీ అనేది ఒక అవసరమైన మధ్యంతర ‘క్రమ శిక్షణ’ అని కాంగ్రెస్ అభిప్రాయపడింది. వినోభాబావే అభివర్ణించినట్టు వారి దృష్టిలో అదొక ‘క్రమశిక్షణ పండుగ’. ఎమర్జెన్సీ అనేది కొద్ది కాలానికి పరిమితమైందే తప్ప దేశంలో అదొక విధానంగా రూపొందలేదు.
ఇవాళ దానికి కాస్త భిన్నమైనది చూస్తున్నాం. రాజ్యం నిర్మాణం అలాగే వున్నా, లోపలంతా ఖాళీ అయిపోయింది. ప్రభుత్వ శక్తికి తోడుగా ఒక నిర్మాణాత్మకమైన శక్తి ఏర్పడింది. ఈ రకమైన బెదిరింపు రాజకీయాలకు ప్రభుత్వానికి మధ్య చక్కని అవగాహన కుదిరింది. ఈ శక్తులు ఒడ్డునుండేవి కావన్న విషయం గుర్తుంచుకోవాలి. అవి ప్రధాన స్రవంతిలోని రాజకీయ శక్తులు. మతం ప్రాతిపదికగా ప్రజల్లో కొందరిని వేరు చేసి, వారి పౌరసత్వాన్ని రద్దు చేయడం. ఇలాంటి ప్రత్యేకమైన రాజకీయాలు ఆర్‌ఎస్‌ఎస్ జీన్స్‌లోనే ఉన్నాయి. అదే కాంగ్రెస్‌కు, వీరికున్న మౌలికమైన తేడా. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటంటే, లౌకిక నీతిపైన, సంస్కృతిపైన, విద్యపైన, శాస్త్ర విజ్ఞానంపైన బహుళ రూపాల్లో దాడులు చేస్తూ, వాటిని కొనసాగిస్తున్నారు. మన జాతీయ నాయకులు ఊహించిన శాస్త్రీయ దృక్పథం గల లౌకిక రాజ్యానికి భిన్నంగా హైందవ రాష్ర్ట నిర్మాణంలో భాగంగా సైద్ధాంతికంగా వీటన్నిటినీ చేపడుతున్నారు.

భారతదేశంపైన వారి దృక్పథం ఏమిటంటే 1947నాటి పరిస్థితికి ఒక భిన్నమైన మార్గం కోసం ప్రజల్లో ఆ రకమైన చైతన్యాన్ని తీసుకురావాలనుకోవడం. వారి యుద్ధమంతా ముస్లింలకు వ్యతిరేకం. మరొక రకంగా చెప్పాలంటే కచ్చితంగా అది హిందువుల ఆధిపత్యం కోసమే. ఒకే మతం, ఒకే ప్రజలు, హిందూ హిందీ; హిందూ రాష్ర్టం కోసం వారు పోరాడుతున్నారు. అంటే భారతీయుల్లో అత్యధిక సంఖ్యాకులు రెండవ శ్రేణి పౌరులుగా మిగిలిపోతారు. హిందూ ఆధిపత్యం కోసం నగరాలకు, వీధులకు ఉన్న పేర్లను మార్చడం, చారిత్రక కట్టడాలను కూల్చడం, ప్రతి చోట గుళ్ళ కోసం అన్వేషించడం వంటి పోరాటాలు చేస్తున్నారు. వారి పోరాటం వెనుకుబాటు తనం కోసమే కానీ, భవిష్యత్తు కోసం కాదు. పేరు లేకుండా కొత్తగా వస్తున్న శక్తివంతమైన ఎమర్జెన్సీని ఎలా నిలువరించాలి? ప్రజలు పెద్ద ఎత్తున ఏకం కావాలి. రైతుల ఉద్యమం అందుకునే ప్రాధాన్యతను సంతరించుకుంది.పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్‌లు, ముస్లింలు ఈ ఉద్యమంలో ఏకమయ్యారు. ముజఫర్‌నగర్ జిల్లా లో జాట్లకు, ముస్లింలకు మధ్య 2013 సెప్టెంబర్‌లో ఘర్షణలు జరిగినప్పటికీ, వారిరువురు ఇప్పుడు ఏకం కావడం చెప్పుకోదగ్గ ఒక గొప్ప పరిణామం. ఈ గొడవలను ప్రోత్సహించారని అనేక మంది బిజెపి సభ్యులపై ఆ రోజుల్లో ఆరోపణలొచ్చాయి. ఈ గొడవల వల్లనే సాధారణ, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఈ ప్రాంతంలో గెలుపొందింది.

రెండు వర్గాలకూ ముజఫర్ నగర్‌లో జరిగిన అల్లర్ల గాయాలను రైతు ఉద్యమం మానేటట్టు చేసింది. ఉద్యమ నిర్మాణం ఈ రకంగా జరగాలి. అందుకునే వర్గ ప్రాతిపదికగా జరిగే ఉద్యమాలు ప్రమాదకరమని మతతత్వవాదులు భావిస్తారు. కులం, మతం ప్రాతిపదికగా ఉద్యమాన్ని నిర్మించడం సాధ్యమని వారు భావిస్తారు. బిజెపి చేస్తున్నది అదే. రైతు ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, కుల వ్యతిరేక ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలకు సైద్ధాంతిక దెబ్బన్న విషయం పెద్ద ఆశ్చర్యమేం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీలో రాజకీయ ఖైదీలు ఎప్పటికైనా అధికారంలోకొస్తారన్న భయంతో వారి పట్ల జైలర్లు చాలా మర్యాదగా వ్యవహరించేవారు.
ఈ రాజకీయ ఖైదీలు సాధారణమైనవారు కాదని ఇందిరా గాంధీ ప్రభుత్వం కూడా వాస్తవాన్ని గ్రహించి వ్యవహరించింది. ప్రత్యర్థులు పైకి రాకుండా అణచివేయాలన్న ఉద్దేశంతో పత్రికలను, వార్తాప్రసార మాధ్యమాలను తమ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు అనుసరించిన పద్ధతులకు భిన్నంగా ఈ రోజు ప్రజలు నోరెత్తకుండా చేయడమే వీరి పద్ధతి. మనకు వ్యతిరేకంగా నిలబడిన ప్రజలను ఎలా ఆపాలి? అన్నది వారి ముందున్న ప్రశ్న. అసమ్మతి గొంతు వినిపించకుండా, ప్రభుత్వానికి, మతతత్వ శక్తులు వేసే వివిధ అవతారాలకు వ్యతిరేకంగా ఎవ్వరూ నిలబడకుండా దేశాన్ని పునర్నిర్మించాలన్నదే వారి ధ్యేయం. కొందరు రాజకీయ ఖైదీలతో ప్రస్తుతం వ్యవహరించే దారుణమైన తీరు ఇప్పటి పరిస్థితిని వివరిస్తుంది.

భీమా కోరెగాన్ కేసులో అరెసె్టై జైల్లో నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఆదివాసీ హక్కుల కార్యకర్త, 82 ఏళ్ళ స్టాన్‌స్వామి ఉదంతం అన్నిటి కంటే దారుణమైన ఉదాహరణ. పార్కిన్‌సన్ సహా అనేక అనారోగ్య కారణాలతో జైల్లో మగ్గుతున్న స్టాన్ స్వామి చేతులు పట్టుకోల్పోయి ఒణకడం వల్ల స్ట్రా గ్లాస్ కావాలని విజ్ఞప్తి చేశారాయన. ఆ విజ్ఞప్తిని పరిశీలించడానికి కొంత సమయం కావాలని ఎన్‌ఐఎ కోరగా, ప్రత్యేక కోర్టు స్టాన్‌స్వామి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. చలికి ఉన్ని దుస్తుల కోసం, స్ట్రా కప్పు కోసం తాజాగా మరొక విజ్ఞాపన పంపుకోవలసి వచ్చింది. ఈ క్రూరమైన చర్యలు, అమానుషమైన వ్యవహారం ‘మేం ఏమనుకుంటామో అదే చేస్తాం. మమ్మల్నెవరూ ఆపలేరు’ అన్న సందేశాన్నిస్తోంది. రాజకీయ ఖైదీలకు న్యాయస్థానాలు ఎంత కాలమైతే రక్షణ కల్పించలేవో అంత కాలం ఈ విధానం కొనసాగుతూనే ఉంటుంది. ఆ సందేశం కొనసాగుతుందనడం వాస్తవం. హక్కులపై దారుణమైన అతిక్రమణలు మరింత బహిర్గతం కావాలి. దీనిపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తాలన్నది నా ఆకాంక్ష. ఇలాంటి కేసులను న్యాయస్థానాలు మరింత తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నది ఒక అనుకూలాంశం. బహుశా ఈ మంచుకొండ కాస్త బీటలు వారుతోందేమో? దాన్ని మనం చూడవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News