కాల్పుల ఘటనలో ఒకరికి గాయాలు
ఐజాల్/హైలాకండి: అసోం, మిజోరాం పోలీసు బలగాల మధ్య హింసాత్మక ఘటనలు జరిగిన మూడు వారాల తర్వాత మంగళవారం జరిగిన ఓ కాల్పుల ఘటన మరోసారి ఇరు రాష్ట్రాల సరిహద్దుప్రాంతాలను ఉద్రిక్తంగా మార్చాయి. అసోం పోలీసులు జరిపిన కాల్పుల్లో తమ రాష్ట్రాలని చెందిన ఒక పౌరుడు గాయపడ్డాడని మిజోరాం ప్రభుత్వం అంటుండగా సరిహద్దు ఆవలి వైపునుంచి దుండగులు గుళ్ల వర్షం కురిపించడంతోనే తమ పోలీసులు వాటిని తిప్పికొట్టాల్సి వచ్చిందని అసోం ప్రభుత్వం వాదిస్తోంది. గత నెల 26న ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మృతి చెందగా ఇరు పక్షాలకు చెందిన 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇరు రాష్ట్రాల మధ్య రాజీకి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కూడా.
కాగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అసోంలోని బిలాయ్‌పూర్‌లో ఉంటున్న తమ మిత్రుడినుంచి మాంసం తీసుకోవడం కోసం వైరెంగ్టే గ్రామానికి చెందిన ముగ్గురు అక్కడికి వెళ్తున్నప్పుడు సరిహద్దుల్లోని ఐత్లాంగ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు కోలశిబ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హెచ్ లాల్‌త్లంగ్లియానా చెప్పారు. సరిహద్దులను కాపలా కాస్తున్న అసోం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు గాయపడినట్లు ఆయన చెప్పారు. కాగా ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగినట్లు హైలాకండి పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ ఉపాధ్యాయ్ కూడా అంగీకరించారు కానీ వివరాలు చెప్పడానికి నిరాకరించారు. అయితే బిలాయ్‌పూర్‌నుంచి సరిహద్ద్దుల వరకు రోడ్డు నిర్మాణం పనుల్లో నిమగ్నమై ఉన్న కూలీలపై దారాసింగ్ కొండలపైపుంచి దుండగులు చీకట్ల్లో గుళ్ల వర్షం కురిపించారని, దీనికి సమాధానంగా అసోం పోలీసులు కూడా పలు రౌండ్లు కాల్పులు జరిపారని జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే తనతో పాటుగా హైలాండి డిప్యూటీ కమిషనర్ రోహన్ ఝా సంఘటనా స్థలానికి వెళ్లామని ఉపాధ్యాయ్ చెప్పారు. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరించినట్లు కూడా ఆయన చెప్పారు.