‘అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి.. విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్‌రెడ్డి గారూ.. కాస్త ఈ విద్యార్థిని గోడు వినండి.. నిజం తెలుసుకోండి.. నాకే పాపం తెలియదు. నమ్మకుంటే నాకు చావే గతి’ అంటూ పదవ తరగతి విద్యార్థిని ఝాన్సీలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆకతాయిలు వచ్చి భయపెట్టి హడావుడి చేయడంతో కంగారు పడ్డాను తప్ప తనకు కాపీ కొట్టి చదవాల్సిన దుస్థితి కాదని, ఎక్కడ పరీక్ష రాయించినా చక్కగా రాసి ఉత్తీర్ణత అయ్యే సత్తా తనకు ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ బాలిక బాధ చూస్తే చలించనివారు ఎవరూ లేరు. ఇటీవల నల్లగొండ జిల్లా, నకిరేకల్ ఎస్‌ఎల్‌బిసి పది పరీక్షా కేంద్రంలో కాపీ కొట్టిందని ఆరోపిస్తూ అధికారులు డిబార్ చేసిన శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన బల్లెం ఝాన్సీలక్ష్మి ముఖ్యమంత్రిని వేడుకుంటూ సోమవారం సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
తాను జిల్లా విద్యాశాఖ అధికారి ఎదుట కూడా నిర్భయంగా పరీక్ష రాసి ఉత్తీర్ణత అయి సత్తా, నిజాయితీని నిరూపించుకుంటానని పేర్కొంది. పరీక్ష కేంద్రంలోని కిటికీ వద్దకు కొందరు ఆకతాయిలు వచ్చి బెదిరించాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందని ప్రశ్నించింది. పరీక్ష కేంద్రాన్ని నిర్వహించే అధికారులు ఈ విషయం ఆలోచించాలని విజ్ఞప్తి చేసింది. ఆకతాయిలు కిటికీ వద్దకు వచ్చి పరీక్ష రాస్తున్న తనను బెదిరించి ఫొటో తీసారని, ప్రశ్నాపత్రం చూపించు.. లేకుంటే రాయితో కొడతామని బెదిరించడంతో ఆ సమయంలో అర్ధం కాక ప్రశ్నాపత్రం చూపించానని తెలిపింది. ఈ విషయంపై అధికారులు సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఆ తర్వాత తనకు ఎగ్జామ్స్ రాసే అవకాశాన్ని కల్పించాలని ప్రాధేయపడుతోంది. నిజాన్ని నిర్ధారించి తనకు మళ్లీ పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని లేకపోతే తనకు చావే గతి అని వాపోతోంది. ఆకతాయిలు పరీక్ష కేంద్రంలోకి రాకుండా నియంత్రిస్తే తనకు ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇలా జరగడానికి సంబంధిత అధికారుల లోపమా? లేకపోతే ఎలా జరిగిందో పూర్తి స్థాయి విచారణ జరిపి తనకు పరీక్షకు అనుమతి ఇప్పించాలని వేడుకొంటోంది. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు.. మీ కూతురు సమానురాలైన నన్ను అర్థం చేసుకొని డిబార్‌ను వెంటనే రద్దు చేయాలి’ అని వేడుకుంటున్నట్లు ఆవేదన వెలిబుచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నా పరీక్షా కేంద్రంలోకి ఆకతాయిలు ఎలా వచ్చారో అధికారులు అర్థం చేసుకునే పరిస్థితి ఉందని అన్నారు. ఏదేమైనప్పటికీ ఒక విద్యార్థి పరిస్థితిని అధికారులందరూ ఆలోచించి ఆమెకు సత్తా ఉందో లేదో నిర్ధారించవచ్చునని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాల్సిన అధికారులు ఎవరో చేసిన పాపానికి ఒక విద్యార్థిని బలి చేయటం ఏమిటని విద్యార్థి సంఘాలు సైతం విమర్శిస్తున్నాయి. మొదటి నుండి పాఠశాలలో ఆ విద్యార్థిని క్లాస్‌లో మంచి మార్కులతో చదువుతూ ఉపాధ్యాయుల మెప్పు పొందుతోందని, అలాంటి ఆమెకు కాపీ కొట్టే అవసరం ఉండదని విద్యార్థ్ధి సంఘాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆ విద్యార్థినికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.