Friday, November 22, 2024

ఎందుకీ ఆర్డినెన్సులు?

- Advertisement -
- Advertisement -

Tenure of CBI and ED extended from two years to five years

కొద్ది రోజుల్లో పార్లమెంటు శీతకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి, ఇంతలోగా ఆర్డినెన్సు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన కోసమని? ఈ ప్రశ్నలిప్పుడు జాతినంతటినీ వేధిస్తున్నాయి. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)ల అధినేతల పదవీ కాలాన్ని రెండేళ్ల నుంచి ఐదేళ్లకు పొడిగిస్తూ హడావిడిగా ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయించారు. ప్రజాప్రాతినిధ్య మందిరానికి ముఖం చాటేసి, రాష్ట్రపతి భవన్ను ఎందుకు ఆశ్రయించారు? ఈ రెండూ దేశ అత్యున్నత నేర పరిశోధక సంస్థలు, హత్యలు, అధికార దుర్వినియోగాలు, కుట్రలు, ఘాతుకాలు, ఆర్ధిక అకృత్యాలు వంటి అమిత ప్రాధాన్యం గల నేరాలపై నిష్పాక్షికంగా, రాజ్యాంగ చట్టబద్ధంగా పరిశోధన జరిపి నేర నిర్ధారణ చేసి అసలు నేరస్థులను చట్టానికి అప్పగించే గురుతర బాధ్యత గల సిబిఐ, ఇడిల అధిపతుల పదవీ కాలాన్ని పొడిగించవలసిన అవసరం ఎందుకు కలిగిందో దేశ ప్రజలకు పార్లమెంటు ముఖంగా వివరించవలసిన బాధ్యత పాలకులపై వుంది. పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చుకోలేక ఆ పరిస్థితి ప్రజల దృష్టిలో పడి పలచనైపోతామనే భయం వల్లనే దొడ్డి దారిలో ఈ కీలక సంస్థల అధిపతుల పదవీ కాలాన్ని నేరుగా తమ ఇష్టానుసారం పెంచుకొనిపోయే అధికారాన్ని పాలకులు ఈ ఆర్డినెన్స్‌ల ద్వారా చేజిక్కించుకున్నారు.

ఆర్డినెన్సులను ఆదివారం నాడు జారీ చేయించిన కేంద్ర ప్రభుత్వం అవి నిరాటంకంగా వెంటనే అమల్లోకి వచ్చేలా చేయడానికి వీలుగా సోమవారం నాడే అందుకు సంబంధించిన సర్వీసు నిబంధనలను కూడా సవరింపజేసింది. 1922 నాటి ఫండమెంటల్ రూల్స్‌లో తగిన మార్పులు తీసుకొచ్చింది. ఇడి సేవా నిబంధనలను నిర్దేశించే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టాన్ని, సిబిఐ కి సంబంధించిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని ఆదరాబాదరాగా సవరింపజేసింది. కేంద్ర నేర పరిశోధన సంస్థలు, దేశ అత్యున్నత దర్యాప్తు వ్యవస్థలైన సిబిఐ, ఆదాయ పన్నుశాఖ (ఐటి,) ఇడిలను కీలక సమయాల్లో స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించిన చరిత్ర కేంద్రంలోని బిజెపి పాలకులకు విశేషంగా వుంది. ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఏప్రిల్ 2వ తేదీన ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కుమార్తె సెంతమరాయ్ నివాసంలో ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపింది. ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులను పురస్కరించుకొని దాడులు జరిపినట్టు చెప్పారు. అలాగే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నెల రోజుల్లో జరగనున్నాయనగా గత ఫిబ్రవరి 1న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహిత బంధువు అభిషేక్ బెనర్జీ ఇంటిపై సిబిఐ దాడి జరిగింది.

అంతకు ఏడాది ముందరి బొగ్గు దొంగతనం కేసులో బెనర్జీ భార్యను, వదినను ప్రశ్నించడానికి సిబిఐ తీసుకు వెళ్లింది. 2019 సెప్టెంబర్‌లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నెల రోజుల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ఆయన బంధువు అజిత్ పవార్‌ల పై మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంకు కేసుకు సంబంధించి ఇడి మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఎన్నికలకు ముందు ప్రతి సారి రాజకీయ ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాలు చేయడానికి, లొంగదీసుకోడానికి ఇడి, ఐటి, సిబిఐలను వారిపై ఉసిగొల్పడం, గిట్టనివారిని రాచిరంపాన పెట్టడానికి దేశ అత్యున్నత ప్రజాస్వామిక దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్న నేపథ్యం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవలసి వుంది. సిబిఐ, ఇడిల అధిపతులు ఈ విధంగా కేంద్ర పాలకుల స్వప్రయోజనాలను సాధించిపెట్టే ఏజెన్సీలుగా మారిన తర్వాత వారి పదవీ కాలాన్ని దొడ్డిదారిలో పొడిగిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సులు ఎంత అపవిత్రమైనవో, అప్రజాస్వామికమైనవో వివరించనక్కరలేదు. ఈ ఆర్డినెన్స్‌ల వెనుక ఇడి డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా ఉదంతం దాగి ఉన్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మిశ్రా పదవీ కాలం నేటితో ముగియనున్నది. ఆయనకు అత్యవసరంగా పొడిగింపు ఇవ్వడం కోసమే ఈ ఆర్డినెన్స్‌లు వెలువడ్డాయని భావిస్తున్నారు. వాస్తవానికి మిశ్రా ఈ పదవిలో కొనసాగినంత వరకు కొనసాగిన చరిత్ర నిర్మలమైనదైతే కాదు. ఇండియన్ రెవెన్యూ (ఐఆర్‌ఎస్) సర్వీసుకు చెందిన సంజయ్ కుమార్ మిశ్రా 2018 నవంబర్ 19న రెండేళ్ల పదవీ కాలానికి ఇడి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత నియామక పత్రంలో మార్పులు చేసి మరో ఏడాది పాటు ఆయనకు అందులో కొనసాగే అవకాశం కల్పించారు. ఆ మార్పులను సుప్రీంకోర్టులో సవాలు చేయగా మూడేళ్ల పదవీ కాలం పూర్తయి తర్వాత అంటే ఈ నెల 17వ తేదీ తర్వాత ఆయనను ఇడి డైరెక్టర్‌గా కొనసాగనివ్వరాదని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అందుకు విరుద్ధంగా ఇప్పటికే వయసు మీరిపోయిన ఆయనకు మరి కొంత కాలం పొడిగింపును ఇవ్వాలని ఈ ఆర్డినెన్స్‌లు తీసుకు వచ్చినట్టు భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News