Friday, December 20, 2024

వైభవంగా భద్రాద్రి రాములోరి తెప్పోత్సవం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం ః వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలంలో జరుగుతున్న ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు వివిధ అవతారాల్లో దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించిన రామయ్య శుక్రవారం గోదావరి నది పరివాహకంలో సీతమ్మ వారితో కలిసి జల విహారం చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంలో నదిలో ఐదుసార్లు తెప్పోత్సవం నిర్వహించగా విద్యుత్ దీపాల అలంకరణతో కన్నుల పండువగా దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూజారుల ప్రత్యేక పూజలతో భద్రాద్రి భక్తి పారవశ్యంలో మునిగి తేలింది.

ఈ సందర్భంగా కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా బాణాసంచా కాల్చారు. ఆకాశంలో తారా జువ్వలు అంబరాన్ని అంటేవిధంగా చూపరులకు కనువిందు చేశాయి. శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారు జామున రెండు గంటలకు ఉత్తర ద్వార దర్శనంలో వేద పండితులు తలుపులు తెరవగా స్వామి వారు నిద్ర లేచి భక్తులను ఆశీర్వదిస్తారు. ఇందుకోసం ఇప్పటికే లక్షలాది మంది భక్తులు భద్రాచలం చేరుకున్నారు. ముక్కోటి వేడుకల కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వం, దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News