మాస్కో: నాటోతో సైనిక దౌత్య సంబంధాలను రద్దు చేస్తున్నట్టు రష్యా విదేశాంగమంత్రి సెర్జే లావ్రోవ్ తెలిపారు. రష్యాకు చెందిన 8మంది దౌత్య అధికారులను నాటో ప్రధాన కార్యాలయం నుంచి బహిష్కరించిన వారం రోజుల తర్వాత రష్యా ఘాటుగా బదులిచ్చింది. రహస్య నిఘా అధికారులుగా రష్యా సిబ్బంది పని చేస్తున్నందునే బహిష్కరించామని నాటో పేర్కొనడం గమనార్హం. మాస్కో నుంచి నాటోకు చెందిన సైనిక దౌత్య సిబ్బంది,సమాచార అధికారులను బహిష్కరిస్తున్నట్టు రష్యా తెలిపింది.
నాటోతో తమ దౌత్య సంబంధాలను నవంబర్ 1 నుంచి లేదా ఆ తర్వాత కొన్ని రోజులకు శాశ్వతంగా రద్దు చేయనున్నట్టు సెర్జే తెలిపారు. ఆ సందర్భంగా నాటో మిలిటరీకి చెందిన ప్రధాన దౌత్యాధికారి కూడా మాస్కో నుంచి వెళ్లాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇక నుంచి పాశ్యాత్య దేశాలతో తమ సంప్రదింపులు బెల్జియంలోని రష్యా దౌత్య కార్యాలయం ద్వారా జరుగుతాయని ఆయన తెలిపారు. నాటో కూటమి, రష్యాకు మధ్య 2014 నుంచే దౌత్య సంబంధాలు చెడిపోయాయి. ఉక్రెయిన్ అంతర్గత సమస్యల్లో రష్యా జోక్యాన్ని నాటో కూటమి గట్టిగా వ్యతిరేకించడమే అందుకు కారణమైంది. నాటో కూటమిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, తదితర దేశాలున్నాయి.