న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల దశలో కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) సోమవారం పలు పార్టీ హోదాలపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. మమత బెనర్జీ నాయకత్వపు తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ సారధ్యపు ఎన్‌సిపి, వామపక్ష సిపిఐలకు ఇప్పటివరకూ ఉన్న జాతీయ పార్టీ హోదాలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇప్పుడు ఈ పార్టీలు కేవలం ప్రాంతీయ పార్టీలుగానే నిలుస్తాయి. కేజ్రీవాల్ నాయకత్వపు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)నకు జాతీయ హోదాను కొత్తగా ప్రకటించారు. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్‌లలో ఈ పార్టీ పోటీకి దిగి సాధించుకున్న ఓట్లశాతం ఇతర వివరాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ కీలకమైన హోదా కల్పించారు. ప్రస్తుత ఆప్ ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉంది.
ఎన్నికల సంఘం సోమవారం పార్టీల హోదాలకు సంబంధించి తన ఆదేశాలతో ప్రకటన వెలువరించింది. పలు అంశాల పరిశీలన తరువాత ఎన్‌సిపి, సిపిఐ, టిఎంసిలకు ఇప్పటివరకూ ఉన్న జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటి క్రమంలో ఇక జాతీయ హోదా ఉన్న పార్టీలు అయిదే. బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, బిఎస్‌పి, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి), తాజాగా ఆప్ జాతీయ పార్టీలుగా ఉంటాయి. ఇక ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాల మేరకు ఇప్పటివరకూ కొన్ని పార్టీలకు ఇచ్చిన రాష్ట్రస్థాయి గుర్తింపును ఉపసంహరించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డికి, ఆంధ్రప్రదేశ్‌లో బిఆర్‌ఎస్‌కు, మణిపూర్‌లో పిడిఎకు, పుదుచ్చేరిలో పిఎంకెకు, పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌ఎస్‌పికి, మిజోరంలో ఎంపిసికి ఇచ్చిన గుర్తింపులను రద్దు చేశారు. ఎన్‌సిపి, టిఎంసిలు ఎన్నికలలో సాధించిన ఫలితాల మేరకు ఆ పార్టీలకు నాగాలాండ్, మేఘాలయాల్లో రాష్ట్రస్థాయి పార్టీలుగా గుర్తింపు ఇచ్చారు.
లోక్‌జన్‌శక్తి పార్టీ (రామ్‌విలాస్) పార్టీకి నాగాలాండ్‌లో గుర్తింపు పొందిన రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీ హోదాను, మేఘాలయాలో వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి, త్రిపురలో తిప్రా మోథా పార్టీకి ఈ గుర్తింపు ఇచ్చినట్లు తెలిపారు. ఏ పార్టీ అయినాజాతీయ హోదాను పొందాలంటే సదరుపార్టీ నాలుగు లేదా అంతకు మించి రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల గుర్తింపు దక్కించుకుని ఉండాలి. లేదా లోక్‌సభలో కనీసం రెండు శాతం స్థానాలతో ఉండాలి. ఈ నిర్ణీత కోటాతోనే జాతీయ పార్టీ హోదాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. జాతీయ పార్టీ హోదా కోల్పోయినట్లు అయితే అటువంటి పార్టీ ఉమ్మడి ఎన్నికల గుర్తును పొందలేదు. రాష్ట్రాల వారిగా వేర్వేరు గుర్తులపై పోటీకి దిగాల్సి ఉంటుంది.
అచిరకాలంలోనే ఈ హోదా : కేజ్రీ ఆనందం
తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కడంపై ఆప్ నేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. అచిరకాలంలోనే తమ పార్టీకి ఈ గుర్తింపు వచ్చిందని ఇది తమకు ఆనందదాయకం అన్నారు. ఇప్పుడు తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.