ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి
టొరంటో: కెనడాలోని ఆంటేరియో ప్రావిన్సులో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కెనడాలో భారతీయుల మరణానికి దారితీసిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటనల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇది రెండవది. దక్షిన ఆంటేరియో ప్రావిన్సులోని క్వింటె వెస్ట్ నగరంలో శనివారం 401 హైవేపై వెళుతున్న పాసింజర్ వ్యానును ట్రాక్టర్ ట్రెయిలర్ ఢీకొంది. వ్యానులో ప్రయాణిస్తున్న భారతీయ విద్యార్థులు హర్‌ప్రీత్ సింగ్(24), జస్పీందర్ సింగ్(21), కరన్‌పాల్ సింగ్(21), మోహిత్ చౌహాన్(23), పవన్ కుమార్(23) సంఘటనా స్థలంలోని మరణించినట్లు ఆంటేరియో ప్రొవెన్షియల్ పోలీసులు తెలిపారు. ఈ విద్యార్థులు గ్రేటర్ టొరంటో, మాంట్రియల్ ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా విచారం వ్యక్తం చేశారు. టొరంటోలోని భారత దౌత్యకార్యాలయం మృతుల స్నేహితులకు అవసరమైన సహాయాన్ని అందచేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మరణించడం పట్ల భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.