టర్కిష్ ఏరోస్పేస్, రక్షణ సంస్థ ‘తుసాస్’ భవనంపై బుధవారం దాడిలో అనేక మంది మరణించడమో లేక గాయపడడమో జరిగిందని టర్కీ దేశీయాంగ శాఖ మంత్రి అలీ యెర్లికయా వెల్లడించారు. రాజధాని అంకారా శివార్లలోని టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఇన్‌కార్పొరేషన్‌పై దాడికి సంబంధించిన ఇతర వివరాలను యెర్లికయా తెలియజేయలేదు. ‘దురదృష్టవశాత్తు ఆ దాడి దరిమిలా మాకు అమరులు, క్షతగాత్రులు ఉన్నారు’ అని యెర్లికయా ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. దాడి వెనుక ఎవరు ఉన్నారో స్పష్టం కాలేదు. కుర్దిష్ తీవ్రవాదులు, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్, వామపక్ష తీవ్రవాదులు గతంలో దేశంలో దాడులు సాగించారు.
భద్రత సిబ్బంది మార్పు సమయంలో దుండగుల బృందం ఒక టాక్సీలో సముదాయంలోకి ప్రవేశించినట్లు ప్రైవేట్ ఎన్‌టివి టెలివిజన్ తెలియజేసింది. దుండగుల్లో కనీసం ఒకడు ఒక బాంబు పేల్చగా ఇతర దుండగులు సముదాయంలోకి ప్రవేశించగలిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో తుపాకుల కాల్పులు కొనసాగుతున్నాయని, సముదాయంలో కొంత మంది సిబ్బందిని బందీలుగా తీసుకుని ఉండవచ్చునని ఎన్‌టివి తెలిపింది. ఆ ప్రాంగణంపైహెలికాప్టర్లు తిరుగుతున్నాయని టివి సంస్థ తెలిపింది.