న్యూఢిల్లీ: ముంబయిలో 1993లో జరిపిన తరహాలోనే అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పథకం వేసిన పాకిస్థాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదుల మాడ్యుల్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించి ముందుగానే నిర్భందంలోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఆరుగురు ఉగ్రవాదుల నుంచి కిలోన్నర ఆర్‌డిఎక్స్ పేలుడు పదార్థాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితును జాన్ మొహమ్మద్ షేఖ్(47) ఉరఫ్ సమీర్, ఉసామా(22), మూల్‌చంద్(47), జీషాన్ ఖమర్(28), మొహమ్మధ్ అబూ బాకర్(23), మొహమ్మద్ ఆమీర్ జావెద్(31)గా గుర్తించారు. ఈ ఉగ్రవాదుల మాడ్యూల్‌లో కొందరు స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో మరికొంతమంది ఉగ్రవాదలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు నిందితులను ఢిల్లీ కోర్టు ముందు ప్రవేశపెట్టగా, కోర్టు వారిని 14 రోజులపాటు పోలీస్ రిమాండ్‌కు అప్పగించింది. తమ ఇంటరాగేషన్‌లో పాకిస్థాన్ ఉగ్రవాద మాడ్యుల్ రెండు విధాలుగా పనిచేస్తోందని, ఒకటి అండర్‌వరల్డ్ కాగా, మరొకటి పాక్-ఐఎస్‌ఐ నుంచి శిక్షణ పొందిన టెర్రర్ మాడ్యూల్ అని పోలీసులు తెలిపారు.