Monday, December 23, 2024

కశ్మీర్‌లో టెర్రరిజం!

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్‌లోని రజౌరి (జమ్మూ) జిల్లాలో శుక్రవారం ఉదయం టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య సంభవించిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఒక అధికారి సహా నలుగురు గాయపడ్డారు. పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో గల కశ్మీర్ ఎంతటి సున్నితమైన రాష్ట్రమో గత చరిత్ర చాటింది. ఆ రాష్ట్రంలో తరచూ జరుగుతున్న టెర్రరిస్టు దాడుల వెనుక పాకిస్తాన్ హస్తమున్నదన్నదీ వాస్తవమే. అటువంటి చోట ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకొని వారి ఆదరాభిమానాలు చూరగొనే పాలనను అందివ్వడం ద్వారానే టెర్రరిస్టులు తోక ముడిచేలా చేయగలం. అందుకు బదులుగా భద్రతా దళాలను విపరీతంగా ప్రయోగించి టెర్రరిస్టులను హతమార్చి శాంతిని నెలకొల్పే విధానాన్ని కేంద్రంలోని బిజెపి పాలకులు అక్కడ అమలు జరుపుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా భద్రతా దళాల కృషి వల్ల జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టు దాడుల సంఖ్య గణనీయంగా తగ్గిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ ప్రకటిస్తూ వుంటారు.

సరిహద్దులకు అవతలి నుంచి టెర్రరిస్టుల రాకను అడ్డుకోడానికి, మొత్తంగా టెర్రరిజాన్ని అంతమొందించడానికి భద్రతా దళాల కాపలాను మరింత పటిష్ఠం చేయవలసిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే భారీగా ఖర్చు పెట్టి, ప్రజాస్వామిక స్వేచ్ఛలను హరించి నిరంతరం టెర్రరిస్టులపై నిఘాతోనే జమ్మూకశ్మీర్‌ను ఎంత కాలం పరిపాలించగలుగుతారు, అది ఖజానా మీద ఎంతెంత భారాన్ని వేస్తుంది? ఇందుకు బదులుగా అక్కడ ఎన్నికలు జరిపించి ప్రజా ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తే టెర్రరిస్టుల సమస్య పరిష్కారాన్ని ప్రజలే చూసుకోరా? జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్ళయింది. ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్ళుగా లేదంటే కేంద్ర పాలన అక్కడి ప్రజల మంచి చెడ్డలను చూడడంలో ఎంతగా విఫలమైవుంటుందో చెప్పనక్కర లేదు. ఆ రాష్ట్రానికి అంతకు పూర్వమున్న స్వయం ప్రతిపత్తిని 2019 ఆగస్టు 5న తొలగించారు.

ఆ మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఆ చర్య పట్ల కశ్మీర్ ప్రజలు తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు. వారి ఆందోళనను అదుపు చేయడం కోసం అక్కడ అనేక ప్రజా స్వేచ్ఛలను కేంద్రం హరించి వేసింది. ఇంటర్‌నెట్ సౌకర్యం కూడా దీర్ఘ కాలం లేకుండా చేసింది. ఫారుఖ్ అబ్దుల్లా , ముఫ్తీ మొహమ్మద్ సయీద్, ఒమర్ అబ్దుల్లా వంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకొన్నది. అక్కడి ప్రజలను, వారి నాయకులను తీవ్ర అసంతృప్తికి గురి చేసిన చర్యలను తీసుకోడం అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చింది. జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ళకు జరిగిన ఎన్నికల్లో బిజెపి ఆధిక్యాన్ని సాధించుకోలేకపోయింది. అంటే కేంద్రంలోని బిజెపి పాలకులు తమ పార్టీ ఎప్పుడో నిర్దేశించుకొన్న ఆర్టికల్ 370 రద్దును జరిపించడానికే ప్రాధాన్యమిచ్చారు గాని, అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవలసిన అవసరాన్ని గుర్తించ లేదు. దాని వల్ల అశాంతి పెరిగి భద్రతా దళాలను విశేషంగా ప్రయోగించడం ద్వారానే పాలనను కొనసాగించుకోవలసిన అగత్యాన్ని వారు తెచ్చుకొన్నారు.

మూడేళ్ళ కాలంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతకు సంబంధించిన అవసరాల కింద రూ. 2,814 కోట్లు ఖర్చు పెట్టినట్లు కేంద్ర హోం శాఖ గత డిసెంబర్‌లో పార్లమెంటులో ప్రకటించింది. అక్కడ టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న విధానంతో పని చేస్తున్నామని గతంతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో భద్రతా వాతావరణం బాగా మెరుగైందని తెలియజేసింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అని అడిగినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీ గాని, హోం మంత్రి అమిత్ షా గాని త్వరలోనే అని చెబుతారు. కాని అవి ఎప్పటికీ జరగవు. ఎన్నికల తర్వాతనే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని అమిత్ షా తాజాగా ప్రకటించి వున్నారు. ఎన్నికలు ఎప్పుడని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను గత మార్చిలో ప్రశ్నించగా అక్కడ ఏర్పడిన ఖాళీని పూరించవలసి వున్నదని ఆయన సమాధానమిచ్చారు. అక్కడ ఎన్నికల నిర్వహణ అనేక అంశాల మీద ఆధారపడి వుందని చెప్పారు. అంటే జమ్మూకశ్మీర్ ప్రజలు ఒక్క బిజెపిని మాత్రమే ఎన్నుకునే పరిస్థితి ఏర్పడనంత వరకు అక్కడ ఎన్నికలు జరగవని అర్థమవుతున్నది.

కేంద్ర పాలనను నిరంతరం కొనసాగించడమే ప్రధాని మోడీ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టపడుతున్నది. టెర్రరిజాన్ని తగ్గించడం, అణచివేయడం అనేవి భద్రతా దళాల ప్రయోగం ద్వారా జరిగినంత వరకు అక్కడ ప్రజాస్వామ్యం అడుగంటినట్టే భావించవలసి వుంటుంది. ఎవరిని ఎన్నుకుంటారనే దాన్ని ప్రజలకు విడిచిపెట్టి ఎన్నికలను నిర్వహించి తీరడమే ఎన్నికల కమిషన్ బాధ్యత. కాని కేంద్ర పాలకుల పంజరంలో మరో చిలక లాంటి ఎన్నికల కమిషన్ గడువు ముగిసే లోగా ఎన్నికల జరిపించే స్వతంత్ర శక్తిగా తనను తాను నిరూపించుకోజాలదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు దరిదాపుల్లో లేవనే బోధపడుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News