Sunday, December 22, 2024

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం అంతిమ దశలో ఉంది

- Advertisement -
- Advertisement -

ఆనువంశిక రాజకీయాలు ఈ ‘అద్భుత ప్రాంతాన్ని’ నాశనం చేశాయి
జెకెకు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం
డోడా జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ

జమ్మూ : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం అంతిమ దశలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉద్ఘాటించారు. ‘ఈ అద్భుత ప్రాంతాన్ని నాశనం చేసిన ఆనువంశిక రాజకీయాలను ఎదుర్కొనడానికి తన ప్రభుత్వం నూతన నాయకత్వాన్ని ముందుకు తీసుకువచ్చిందని ప్రధాని మోడీ చెప్పారు. జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ఒక భారీ ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణకు తన ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని కూడా పునరుద్ఘాటించారు. ఎన్‌సి, కాంగ్రెస్, పిడిపిలను తిరిగి అధికారంలోకి తీసుకురావద్దని ప్రజలను ఆయన హెచ్చరించారు. ఈ నెల 18 అసెంబ్లీ ఎన్నికల తొలి విడతకు ముందుగా జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని ప్రసంగించిన తొలి ఎన్నికల ర్యాలీ ఇది. జమ్మూ ప్రాంతంలోని మూడు జిల్లాలు దోడా, కిష్ట్‌వార్, రాంబన్, దక్షిణ కాశ్మీర్‌లోని నాలుగు జిల్లాలు అనంతనాగ్, పుల్వామా, షోపియన్, కుల్గామ్ వ్యాప్తంగా 24 స్థానాల్లో మొదటి విడత పోలింగ్ జరగనున్నది.

25న రెండవ విడతగా 26 నియోజకవర్గాల్లో, మూడవ, చివరి విడతా అక్టోబర్ 1న 40 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ర్యాలీకి హాజరైన ప్రజలకు కాశ్మీరీ భాషలో స్వాగతం పలుకుతూ మోడీ తన సుమారు 45 నిమిషాల ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి విదేశీ శక్తులకు లక్షంగా ఉండిపోయిన జమ్మూ కాశ్మీర్ భవితను ఈ పర్యాయం ఈ (అసెంబీ) ఎన్నికలు నిర్ణయిస్తాయి’ అని ప్రధాని మోడీ సభికులతో చెప్పారు. ‘అంతే కాదు. ఆనువంశిక రాజకీయాలు ఈ రమణీయ ప్రాంతాన్ని లోపలి నుంచి డొల్లగా మార్చాయి. మీరు నమ్మిన రాజకీయ పార్టీలు మీ పిల్లల పట్ల ఎన్నడూ శ్రద్ధ వహించలేదు. అవి తమ పిల్లల కోసమే శ్రద్ధ వహించి, వారిని ముందుకు నెట్టాయి. కొత్త నాయకత్వాన్ని అవి వృద్ధి చెందనివ్వలేదు’ అని మోడీ విమర్శించారు. ‘2014లో కేంద్రంలో మేము అధికారంలోకి వచ్చిన’ వెంటనే జమ్మూ కాశ్మీర్‌లో యువ నాయకత్వం రూపకల్పనపై తన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది’ అని ప్రధాని చెప్పారు.

‘జెకె యువజనులు ఉగ్రవాదం బెడదను ఎదుర్కొనడానికి అలవాటు పడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా కుటుంబవాదాన్ని ప్రోత్సహించిన పార్టీలు యువ నాయకులను చోటు చేసుకోనివ్వలేదు. 2000 నుంచి పంచాయతీ ఎన్నికలు జరగలేదు. బ్లాక్ అభివృద్ధి మండలి (బిడిసి). జిల్లా అభివృద్ధి మండలి (జిడిసి) ఎన్నికలు ఎన్నడూ జరగలేదు& 2014 తరువాత యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాను. 2018లో పంచాయతీ ఎన్నికలు, 2019లో బిడిసి ఎన్నికలు, 2020లో జిడిసి ఎన్నికలు నిర్వహించాం. యువజనుల బాధ్యతలు చేపట్టేందుకు వీలు కల్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లడమే ఆ ఎన్నికల నిర్వహణకు కారణం’ అని మోడీ తెలియజేశారు. కాంగ్రెస్, ఎన్‌సి, పిడిపిలపై తన విమర్శలను మోడీ కొనసాగిస్తూ, ఆ పార్టీలు యువత రాజకీయాల్లో చేరాలని ఎన్నడూ కోరుకోలేదని, కానీ, ‘వారి ఉద్దేశాలనే మేము సవాల్ చేశాం.

తత్ఫలితమే 30 వేల మంది నుంచి 35 వేల మంది వరకు యువజనులు (స్థానిక సంస్థల ఎన్నికల్లో) గెలిచి, జెకెపై నియంత్రణ సాధించారు’ అని చెప్పారు. బిజెపి ప్రభుత్వ హయాంలో జమ్మూ కాశ్మీర్ కొత్త దశ అభివృద్ధిని చూసిందని, అందుకు ఘనత ఎన్నికైన ఆ యువజనులదే అని ప్రధాని పేర్కొన్నారు. ‘వారి కృషికి సెల్యూట్ చేస్తున్నా’ అని ఆయన చెప్పారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికలు మూడు కుటుంబాలు, యువత మధ్య. ఒక వైపు ఆ మూడు కుటుంబాలు ఉన్నాయి. మరొక వైపు తమ కలలే ప్రేరణగా కల నా కుమార్తెలు, సోదరీమణులు ఉన్నారు’ అని ఆయన తెలిపారు.

‘కాంగ్రెస్, ఎన్‌సి, పిడిపి చేసింది పాపమే తప్ప ఏమీ కాదు. ఎందుకంటే ఆ మూడు కుటుంబాలు జెకెను నాశనం చేశాయి. అవి అవినీతిని, భూ కబ్జాకోరులను ప్రోత్సహించి, ప్రజలకు వారి హక్కులు, సౌకర్యాలు దక్కకుండా చేశాయి. అవి తమతో సంబంధం ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి, అవి వేర్పాటువాదానికి, ఉగ్రవాదానికి ఆస్కారం ఇచ్చాయి’ అని ప్రధాని ఆరోపించారు. ‘గడచిన పది సంవత్సరాల్లో జెకెలో కానవచ్చిన మార్పు కల సాకారం కావడమే తప్ప వేరే ఏమీ కాదు. పోలీసులపైకి, సైన్యంపైకి విసరడానికి ఉపయోగించే రాయి ఇప్పుడు కొత్త జమ్మూ కాశ్మీర్ నిర్మాణానికి ఉపయోగపడుతున్నది& దీనిని మోడీ కాకుండా జమ్మూ కాశ్మీర్ ప్రజలే చేశారు’ అని ప్రధాని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News