అఫ్ఘాన్ పరిణామాలపై ప్రధాని మోడీ వ్యాఖ్య
సోమనాథ్(గుజరాత్): ఉగ్ర చర్యల ద్వారా సామ్రాజ్యాలు సృష్టించవచ్చన్న సిద్ధాంతాన్ని పాటించే విచ్ఛన్నకర శక్తులు, కొందరు వ్యక్తులు కొంతకాలం ఆధిక్యత ప్రదర్శించవచ్చని, అయితే మానవాళిని ఎల్లకాలం అణచివేయడం సాధ్యం కానందు వల్ల వీరి మనుగడ శాశ్వతం కాదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయానికి సంబంధించిన కొన్ని ప్రాజక్టులను శుక్రవారం ఆయన వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ సోమనాథ్ ఆలయం పలుసార్లు ధ్వంసమైందని, అనేక సార్లు ఆలయంలోని విగ్రహాలు అపవిత్రం చెందాయని, ఆలయాన్నే సమూలంగా చెరిపివేయాడానికి ప్రయత్నాలు కూడా జరిగాయని, కాని..ప్రతి విధ్వంసక దాడి తర్వాత ఆలయం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుందని, ఇది మనందరికీ ఎంతో ఆత్మ విశ్వాసాన్ని కలిగించే విషయమని అన్నారు. గతంలో సోమనాథ్ ఆలయం ధ్వంసం అయిన విషయం వాస్తవమని, ఇప్పుడు అదే ఆలయం ఎంతో వైభవంగా ఉన్న విషయం కూడా వాస్తవమని ఆయన అన్నారు. అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటీటివ్ ఇండెక్స్‌లో 2013లో 65వ స్థానంలో ఉన్న భారత్ 2019లో 34 స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు.