అమెరికా అధ్యక్షులు బైడెన్ హెచ్చరికలు
వాషింగ్టన్: వచ్చే 24 నుంచి 36 గంటలలో కాబూల్ ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆదివారం హెచ్చరించారు. ఆగస్టు 31వ తేదీతో అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణ పూర్తి అవుతుంది. సంబంధిత గడువును అమెరికా అధికార యంత్రాంగం ఖరారు చేసుకుంది. ఈలోగానే అక్కడి నుంచి మిగిలిన అమెరికన్లను తరలించి స్వదేశానికి తీసుకురావాలని బైడెన్ సంకల్పించారు. అయితే వచ్చే కొన్ని గంటలు కాబూల్ ఎయిర్‌పోర్టు పరిసరాలలో ఎటువంటి పేలుడు అయినా జరగవచ్చునని బైడెన్ స్వయంగా తెలిపారు. కాబూల్ ఎయిర్ పోర్టులోపల, వెలుపల పరిస్థితి క్షేత్రస్థాయిలో అత్యంత ప్రమాదకరంగా ఉందని బైడెన్ విశ్లేషించారు. తనకు అత్యున్నత స్థాయిలో అందిన నిఘా వర్గాల సమాచారాన్ని బేరీజు వేసుకుని ఈ హెచ్చరిక వెలువరించారు.
తనకు తన సైనిక కమాండర్ల నుంచి అందిన సమాచారం మేరకు వచ్చే కొద్ది గంటల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టుపై బాంబుల దాడులు జరిగే అవకాశం ఉందని బైడెన్ తెలిపారు. అక్కడి సైనిక బలగాలు మరింత అప్రమత్తంగా ఉంటూ, తమ భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూనే ఎటువంటి టెర్రర్ దాడిని అయినా తిప్పికొట్టే రీతిలో వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. గురువారం కాబూల్ ఎయిర్‌పోర్టు వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో దాదాపు 200 మంది చనిపొయ్యారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఈ ఘటనతో పూర్తి స్థాయిలో కలత చెందిన బైడెన్ దీనికి సంబంధించి బాధ్యత ఐసిస్ కె ఇస్లామిక్ తీవ్రవాద సంస్థపై ప్రతీకారం తీసుకుంటామని బైడెన్ వైట్‌హౌస్‌లో జరిగిన వారాంతపు ప్రెస్‌మీట్‌లో తెలిపారు. మిషన్ విండ్స్ డౌన్ పేరిట అమెరికా ప్రభుత్వం అఫ్ఘన్‌లోని చిక్కుపడ్డ అమెరికన్లను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికీ అక్కడ మరికొందరు అక్కడనే నిలిచి ఉన్నారు.