Wednesday, January 22, 2025

గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు!

- Advertisement -
- Advertisement -

Terrorist threat to Republic day celebration

ప్రధాని, ప్రముఖులు లక్ష్యంగా దాడులకు పాల్పడే ప్రమాదం
డ్రోన్ల ద్వారా దాడి చేసే అవకాశముందని హెచ్చరిక
ఇంటెలిజన్స్ వర్గాల హెచ్చరికలతో భద్రతా యంత్రాంగం అప్రమత్తం

న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీసహా పలువురు ప్రముఖులపై దాడికి ముష్కరులు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ మేరకు 9 పేజీల ఇంటెలిజన్స్ నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అందినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, అఫ్గాన్‌పాక్ ప్రాంతాలకు చెందిన గ్రూపులనుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతో పాటుగా బహిరంగ సభలు, కీలక సంస్థలు, రద్దీ ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సమూహాలు కుట్ర చేసినట్లు ఐబి వెల్లడించింది. డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడవచ్చని హెచ్చరించింది. లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహమ్మద్, హర్కతుల్ ముజాహిద్దీన్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రసంస్థలు ఈ ఉగ్ర కుట్ర వెనుక ఉన్నట్లు పేర్కొంది. పాకిస్థాన్‌లో ఉన్న ఖలిస్థానీ గ్రూపులు పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని.. పంజాబ్‌తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో లక్షిత దాడులకు ప్రణాళికలు వేస్తున్నారని కూడా ఇంటెలిజన్స్ వర్గాలు ఆ నివేదికలో హెచ్చరించాయి.

భద్రతా వలయంలో దేశ రాజధాని

రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశముందంటూ ఇంటలిజన్స్ హెచ్చరికలు అందిన దృష్టా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్( ఎన్‌సిఆర్) ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రిపబ్లిక్ వేడుకల దృష్టా ఈ నెల 20నుంచి దేశ రాజధాని గగన తలంపై డ్రోన్లు( యుఎవిలు), పారా గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు లాంటి సబ్ కన్వెన్షనల్ ఏరియల్ ప్లాట్‌ఫామ్‌ల ఆపరేషన్‌ను నిషేధించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 20నుంచి అమలులోకి వచ్చే ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 15 దాకా అమలులో ఉంటాయి. కొంతమంది క్రిమినల్స్ లేదా సంఘ వ్యతిరేక శక్తులు లేదా టెర్రరిస్టులు సాధారణ పౌరులకు, ప్రముఖులకు, కీలక సంస్థల భద్రతకు ముప్పు కలిగించే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్థానా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా గణతంత్ర దినోత్సవాల దృష్టా భద్రతను పూర్తి కట్టదిట్టం చేశామని, గణతంత్ర వేడుకలు జరిగే మొత్ంత ప్రాంతాన్ని ముఖాలను గుర్తు పట్టే సాఫ్ట్‌వేర్‌తో కూడిన 300కు పైగా సిసిటివిలను ఏర్పాటు చేస్తున్నట్లు న్యూఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ దీపక్ యాదవ్ చెప్పారు. పారా మిలిటరీ బలగాలతో పాటుగా ఢిల్లీ పోలీసుకు చెందిన అన్ని విభాగాలు, ఎన్‌ఎస్‌జికి చెందిన బృందాలను భద్రత కోసం వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు. రెండు డోసులు పూర్తి వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే వేడుకలకు అనుమతించడం జరుగుతుందని, పిల్లలను అనుమతించబోమని చెపారు. ఈ ఏడాది వేడుకలకు దాదాపు 24 వేల మంది ఆహూతులనుఅనుమతించడం జరుగుతుందని, ఇందులో 4 5 వేల టికెట్లను ప్రజలకు జారీ చేయడం జరుగుతుందని దీపక్ యాదవ్ చెప్పారు. పంజాబ్‌లో ఇటీవల ప్రధాని కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యం దృష్టా అలాంటి సంఘటనలు మరో సారి జరక్కుండా పోలీసు బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తాయని ఢిల్లీ పోలీసు అధికారులు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News