Thursday, September 19, 2024

భయం గుప్పిట్లో కశ్మీరు బిజెపి కార్యకర్తలు..

- Advertisement -
- Advertisement -

భయం గుప్పిట్లో కశ్మీరు బిజెపి కార్యకర్తలు.. తీవ్రవాదుల దాడులతో పార్టీకి వరుస రాజీనామాలు
బిజెపి సర్పంచ్‌లు, పంచాయతీ సభ్యులే టార్గెట్‌గా దాడులు

Terrorists attack on BJP Activists in Jammu Kashmir

శ్రీనగర్: గ్రామీణస్థాయి నాయకులపై తీవ్రవాదుల దాడులు పెరిగిపోవడంతో కశ్మీరులో దాదాపు డజను మంది బిజెపి కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కార్యకర్తలపై తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో కార్యకర్తలకు, వారి కుటుంబాలకు కశ్మీరు లోయలోని అన్ని జిల్లాలలో భద్రతతో కూడిన హాస్టల్ తరహా వసతి ఏర్పాటు చేయాలని బిజెపి సూచించింది. బుడ్గామ్‌కు చెందిన బిజెపి ఓబిసి మోర్చ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నజర్‌పై ఆదివారం ఆయన స్వగ్రామంలో తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో తీవ్రంగా గాయపడిన హమీద్ నజర్ సోమవారం ఆసుపత్రిలో మరణించడంతో బిజెపి కార్యకర్తలలో భయాందోళన పెరిగిపోయింది. బిజెపికి చెందిన పంచాయత్ సభ్యులు, సర్పుంచులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోవడంతో పార్టీకి చెందిన కిందిస్థాయి కార్యకర్తలు పెద్దసంఖ్యలో రాజీనామాలు చేశారని ఒక బిజెపి నాయకుడు తెలిపారు. పార్టీకి తాము రాజీనామా చేస్తున్నట్లు, పార్టీతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తూ పలువురు బిజెపి కార్యకర్తలు సోషల్ మీడియాలో వీడియోలు, లేఖలు పోస్టు చేస్తున్నారు. కుల్గామ్ జిల్లాకు చెందిన ఇద్దరు పంచాయత్ సభ్యులు, ఒక సర్పంచ్‌తోసహా పలువురు బిజెపి కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారని ఆయన తెలిపారు. హంద్వారా, కుప్వారా, సోపోర్ నుంచి కూడా రాజీనామాలు చేసినట్లు ఆయన వెల్లడించారు.

కాగా, తీవ్రవాదులకు బెదిరి పార్టీ కార్యకర్తలు రాజీనామా చేస్తున్నారన్న వార్తలను బిజెపి మీడియా సెల్ ఇన్‌చార్జ్ మంజూర్ భట్ కొట్టివేశారు. వీరంతా పార్టీ కిందిస్థాయి కార్యకర్తలని, వీరి రాజీనామాల ప్రభావం పార్టీపై ఏమాత్రం ఉండబోదని ఆయన చెప్పారు. అయితే, పార్టీ కార్యకర్తలపై తీవ్రవాదుల దాడులను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు సురక్షితమైన వసతిని కల్పించాలని సూచించామని ఆయన స్పష్టం చేశారు. బిజెపి జమ్మూకశ్మీరు ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) అశోక్ కైల్ ఈ వ్యవహారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దృష్టికి తీసుకెళ్లారని, తమ పార్టీ సభ్యుల భద్రతకు పార్టీ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. బిజెపి బండిపొర జిల్లా మాజీ అధ్యక్షుడు వాసిమ్ బరీ, ఆయన తండ్రి బషీర్ అహ్మద్, ఆయన సోదరుడు ఉమర్ బరీని గత ఆదివారం ఉత్తర కశ్మీరులో తీవ్రవాదులు హతమార్చారు. ఆగస్టు 4న కుల్గామ్ జిల్లాలో ఒక బిజెపి సర్పంచ్ హత్యకు గురికాగా రెండు రోజుల తర్వాత పార్టీకి చెందిన మరో సర్పంచ్ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆదివారం నజర్‌పై తీవ్రవాదులు కాల్పులు జరపడం, ఆయన మరుసటి రోజు మరణించడంతో కేంద్రపాలిత ప్రాంతంలోని బిజెపి కార్యకర్తలు, నాయకులను భయాందోళనలకు గురిచేస్తోంది.

Terrorists attack on BJP Activists in Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News