శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని ఫూంచ్‌లో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు దాడికి దిగారు. తనిఖీలకు వెళ్లుతున్న సైనిక జవాన్ల వాహనాలను ఎంచుకుని కాల్పులు జరిపారు. అప్రమత్తంగా ఉన్న జవాన్లు ఎదురుదాడికి దిగారు. పరస్పర కాల్పుల దశలో ప్రాణనష్టం సమాచారం ఏదీ వెలువడలేదు. సమీపంలోని కృష్ణ ఘాటీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు వాహనాలపై దాడికి దిగినట్లువెల్లడైంది. ఫూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదుల సంచారం గురించి అందిన సమాచారంతో జవాన్లు గస్తీ ముమ్మరం చేసిన దశలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
కాల్పుల తరువాత గుట్టల మీదుగా ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారని ఆర్మీవర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో తరచూ జవాన్ల శకటాలను టార్గెటుగా చేసుకుని ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. ఈ సమస్యను అరికట్టేందుకు నార్తర్న్ కమాండ్ అధికారి , లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర ఉన్నత స్థాయి సైనికాధికారుల వ్యూహరచన సమావేశం పూంఛ్‌లో జరుగుతున్న దశలోనే ఉగ్రవాదులు చర్యకు దిగడం జరిగింది.