ఇద్దరు పాక్ ఉగ్రవాదులతో సహా ఆరుగురి అరెస్టు
న్యూఢిల్లీ : దేశం లోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. చాకచక్యంగా వ్యవహరించి మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అదుపు లోకి తీసుకున్నారు. వాళ్లలో ఇద్దరు పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్ధాలు, మందుపాతరలు, మారణాయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు స్పెషల్ సెల్ డిసిపి ప్రమోద్ కుశ్వాహా చెప్పారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ప్రయాగ్‌రాజ్, ఢిల్లీలో సోదాలు నిర్వహించి ఉగ్రవాదులను అదుపు లోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన ఆరుగురిలో ఒసామా, జీశన్ అనే ఇద్దరు పాకిస్థాన్‌లో శిక్షణ పొందినట్టు చెప్పారు. ఆ ఇద్దరినీ ప్రయాగ్‌రాజ్‌లో అరెస్టు చేశారు. ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేశారని పోలీసులు చెప్పారు. దసరా నవరాత్రులు, ఇతర పండగల సందర్భంగా మందుపాతరలు, మారణాయుధాలతో విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర జరిగిందన్నారు.