శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో స్థానికేతరుడిపై సోమవారం ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. తుపాకీ గాయాలతో అతడు మృతి చెందాడు. మృతుడు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వలస కూలీ అని పోలీస్‌లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు జరుగుతోందని చెప్పారు. “ పుల్వామా లోని నౌపోరా ప్రాంతంలో ఓ వలస కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తూటా గాయాలతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముకేశ్‌గా గుర్తించాం” అని పోలీస్‌లు తెలిపారు. జమ్ముకశ్మీర్ లో 24 గంటల వ్యవధిలో జరిగిన రెండో ఘటన ఇది.
ఆదివారం కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్ లోని ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతున్న జమ్ముకశ్మీర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వనీపై ఓ ఉగ్రవాది కాల్పులు జరిపి పారిపోయాడు. ఇన్‌స్పెక్టర్ జట్టు లోని ఇతర సభ్యులు ఆ ఉగ్రవాదిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు గాలిలో కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురి చేశాడు. ప్రస్తుతం ఆ ఇన్‌స్పెక్టర్ పరిస్థితి విషమంగా ఉందని పోలీస్‌లు తెలిపారు. ఈ ఘటనకు తామే పాల్పడినట్టు పాక్‌కు చెందిన లష్కరే తయ్యిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.