ఎపిలోని విజయవాడలో నిషేధిత సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) సానుభూతిపరుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన నిర్దిష్టమైన సమాచారం మేరకు నగరంలో పది మంది అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సుమారు రెండు నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాలు నలుగురు అనుమానిత సిమి సానుభూతిపరులకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీసు కమిషనరేట్ అధికారులకు అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు, తమదైన శైలిలో దర్యా ప్తును ముమ్మరం చేసి, మరో ఆరుగురు అనుమానితులను గుర్తించినట్లు సమాచారం. దీంతో మొత్తం పది మంది వ్యక్తుల కదలికలపై నిఘా వ్యవస్థను కేంద్రీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ పది మంది అనుమానితులు నగరంలోని గొల్లపూడి,
అశోక్ నగర్, లబ్బీపేట వంటి ప్రాంతాలలో నివాసం ఉంటున్నారని, వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని గుర్తించినట్లు తెలిసింది. అయితే, ఇప్పటి వరకూ వీరి నుంచి ఎలాంటి చట్టవ్యతిరేక లేదా అనుమానాస్పద కార్యకలాపాలు తమ దృష్టికి రాలేదని, అయినప్పటికీ వీరిపై నిఘాను నిరంతరం కొనసాగిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో విజయవాడ నగరం మావోయిస్టులకు సైతం కీలకమైన షెల్టర్ జోన్‌గా నిలిచిన అనుభవాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సమాచారంతో భద్రతా యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పరిస్థితిని నిశితంగా గమ నిస్తున్నామని, అనుమానితులపై నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.