Sunday, January 19, 2025

ఉగ్రవాదుల బెదిరింపు… టి20 వరల్డ్ కప్ కు పటిష్టమైన భద్రత

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీల్ రౌలే

ట్రినిడాడ్ : వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీకి ఉగ్రవాద ప్రమాదం పొంచి ఉందనే వార్తలపై నిర్వాహక దేశాల్లో ఒకటైన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం స్పందించింది. మెగా టోర్నీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇవి నిర్వాహక దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వార్తలపై ఆతిథ్య దేశాలతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రతినిధులు స్పందించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీత్ రౌలే మాట్లాడుతూ ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం బాధగా ఉందన్నారు.

21వ దశాబ్దలోనూ ఉగ్రవాద ముప్పు పెరిగిపోవడం బాధాకరమన్నారు. విభిన్న మార్గాల్లో ఉగ్రవాదం వ్యాపిస్తుందని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు మంచిది కాదన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు అన్ని దేశాలు సమాయత్తం కావాలని ప్రధాని సూచించారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంగ్రమాల్లో ఒకటైన వరల్డ్‌కప్‌ను నిర్వహించే అవకాశం తమకు దక్కడం గర్వంగా ఉందన్నారు. అందివచ్చిన అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య మెగా టోర్నీని అత్యంత విజయవంతంగా నిర్వహిస్తామని ప్రధాని స్పంస్ఠం చేశారు. ప్రపంచకప్ ముగిసే వరకు మ్యాచ్‌లు జరిగే వేదికలు, పర్యాటక కేంద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెగా టోర్నీని సాఫీగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. దీని కోసం ఇప్పటికే ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సంస్థలు అహర్నిశలు కృషి చేస్తున్నాయన్నారు. ఇక వరల్డ్‌కప్‌లో పాల్గొనే ప్రతి ఆటగాడికి వ్యక్తగత భద్రతను కల్పిస్తామన్నారు. క్రికెటర్లు, సహాయక సిబ్బంది, కామంటేటర్లు, విశ్లేషకులు, అభిమానులకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. అందరి సహకారంతో వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని ప్రధాని కీత్ రౌలే స్పష్టం చేశారు. మరోవైపు ఐసిసి కూడా వరల్డ్‌కప్‌ను ఎలాంటి అవరోధాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. టోర్నీలో పాల్గొనే దేశాలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడాలని కోరింది. ప్రతి క్రికెటర్‌కు పూర్తి భద్రత ఉంటుందని ఐసిసి అధికారులు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News