వాషింగ్టన్ : అఫ్గాన్‌స్థాన్ నుంచి అమెరికన్ల తరలింపు ఈనెల చివరి లోగా పూర్తి అవుతుందని, అయితే రద్దీగా ఉన్న కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. ఖర్జాయ్ విమానాశ్రయానికి జనం భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి హృదయ విదారకంగా ఉందన్నారు. తాలిబన్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆగస్టు 31 లోగా కాబూల్ నుంచి జనాల తరలింపు ముగుస్తుందని బైడెన్ చెప్పారు. వైట్‌హౌస్ నుంచి ఆయన మాట్లాడుతూ ఆ తేదీ పొడిగింపు కాదని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. విదేశీ నేతలు మరింత సమయం అడుగుతున్నారని, వేసిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఇప్పటివరకు 28 వేల మందిని తరలించినట్టు తెలిపారు. వేలాది సంఖ్యలో జనాలను తరలిస్తున్న సమయంలో ఆర్తనాదాలు, బాధలు తప్పవన్నారు. కాబూల్‌లో ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఐఎస్‌ఐఎస్ కే గ్రూపుతో సమస్యలు ఉన్నట్టు చెప్పారు. అక్కడ ఉన్న పరిస్థితులను ఉగ్రవాదులు మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు.