Friday, December 20, 2024

టెస్లా ప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

అమెరికన్ బిలియనీర్ ఎలెన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా విద్యుత్ వాహనాలు త్వరలో భారతదేశ మార్కెట్‌లో ప్రవేశించబోతున్నాయనే వార్తలు దేశీయ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పటి నుంచో భారతదేశ మార్కెట్‌పై కన్నేసి కేంద్రంతో అనేక దఫాలు లాబీయింగ్ చేసిన మస్క్ ప్రయత్నాలు కొంత మేరకు ఫలించడంతో కేంద్రం మెత్తబడి కొన్ని షరతులతో విదేశీ విద్యుత్ వాహనాలకు అనుమతి ప్రకటించింది. ఎలెన్ మస్క్ ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీతో స్వయంగా భేటీ కాబోతున్నారు.

ఈ భేటీ తర్వాత కీలక ప్రకటన రావచ్చని అంటున్నారు. ఇప్పటికే టెస్లా వాహన ఉత్పత్తికి రారమ్మంటూ అనేక రాష్ట్రాలు మస్క్‌కు ఆహ్వానాలు పంపాయి. మోడీతో భేటీ తర్వాత ఏ రాష్ట్రంలో టెస్లా విద్యుత్ వాహన ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారో ప్రకటన రావచ్చని చెబుతున్నారు. టెస్లా ప్రవేశంతో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు రావొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికల్లా టెస్లా వాహనాలు భారత్‌కు దిగుమతి అవుతాయని, మూడేళ్ళల్లో ఇక్కడే ఉత్పత్తి అవుతాయని టెస్లాను ఉటంకిస్తూ కేంద్ర అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇవి వాహనాల విద్యుత్ ఉత్పత్తి భారత్‌లో చేపట్టడానికి టెస్లాతో పాటు విన్‌ఫాస్ట్, చైనాకు చెందిన బివైడి, కియా, స్కోడా, మెర్సిడెస్‌బెంజ్, బిఎండబ్లు కంపెనీలు క్యూ కట్టాయి.

ఇందులో ఏ కంపెనీలు ముందుగా వస్తాయో ఇప్పటికైతే తెలియదు. విదేశాల నుంచి కార్ల దిగుమతులపై ప్రభుత్వం 60 నుంచి 100 శాతం దాకా కస్టమ్స్ డ్యూటీలు విధిస్తోంది. దీనితో ఇక్కడకు దిగుమతి అయ్యే కార్ల ధర భారతీయులు భరించలేని విధంగా ఉంది. కస్టమ్స్ డ్యూటీలు తగ్గించాలని మస్క్ అనేక మార్లు ఎక్స్‌లో ప్రభుత్వానికి, ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కాని కేంద్రం మస్క్ లాబీయింగ్‌కు తలొగ్గలేదు. స్థానికంగా కార్లను ఉత్పత్తి చేస్తేనే కస్టమ్స్ డ్యూటీలు తగ్గిస్తామని, అది కూడా దేశీయ కార్ల కంపెనీలకు నష్టం జరగకుండా షరతులు పెడతామని కేంద్రం సమాధానం ఇచ్చింది. కేంద్రం పెట్టే షరతులకు మస్క్‌తో సహా మరి కొన్ని అంతర్జాతీయ కార్ల కంపెనీలు ఎస్ చెప్పడంతో కేంద్రం ఇటీవలే విదేశీ కార్ల దిగుమతి విధానాన్ని ప్రకటించింది.

ఈ విధానం ప్రకారం విదేశాలకు చెందిన ఏ కంపెనీ అయినా మూడేళ్ళలో భారత దేశంలో కార్ల ఉత్పత్తికి రూ. 4150 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ పెడితే ఆ కంపెనీకి చెందిన విదేశీ కార్ల దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తామని ప్రకటించింది. అయితే దిగుమతి అయ్యే కార్ల ధరలు రూ. 29 లక్షలకు పైనే ఉండాలని షరతు నిర్ధారించింది. నిజానికి దేశంలో ఎక్కువగా కార్లు 10 నుంచి 25 లక్షల ధరల మధ్య అమ్ముడుపోతున్నాయి. దేశీయంగా మహీంద్ర, టాటా కంపెనీలు ఈరేంజ్ లోనే విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. రూ. 29 లక్షల పైన ఖరీదు చేసే లగ్జరీ కార్లకు మాత్రమే 15 శాతం సుంకం చెల్లించాలని, ఏడాదికి దిగుమతి చేసే విదేశీ కార్లు 8 వేలకు మించకూడదని కూడా కేంద్రం షరతులు పెట్టింది.

ఈ మేరకు కేంద్రం షరతులకు అంగీకరించి ఎంఒయు చేసుకుంటేనే తొలుత కార్ల దిగుమతికి, కార్ల ఉత్పత్తికి రాయితీలు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విధానానికి టెస్లాతో సహా పలు కంపెనీలు స్వాగతం చెప్పాయి. అయితే దేశీయ కంపెనీలు మాత్రం టెస్లాను వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో ఛార్జింగ్ వ్యవస్థ మెరుగుపరచకుండా విదేశీ కార్ల దిగుమతి, ఉత్పత్తికి పచ్చజెండా ఊపడం పలు దుష్పరిణామాలకు దారి తీస్తుందని దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాని కేంద్రం విద్యుత్ వాహనాల అధికోత్పత్తిని ప్రోత్సహిస్తున్నది. 2030 కల్లా దేశంలో 30 శాతం కార్లు విద్యుత్‌లోకి మారిపోవాలని దీనివల్ల పర్యావరణంతోపాటు కేంద్రంపై ముడి చమురు భారం, వ్యక్తిగతంగా కార్ల వినియోగదారులపై ధరల పోటు తగ్గుతుందని, ఇది అందరికీ ఆమోదయోగ్యం అవుతుందని కేంద్రం చెబుతున్నది.

దేశంలో పెట్రోల్ బంకుల మాదిరిగా ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ కార్లకు కీలకమైన లిథియం ఇయాన్ బ్యాటరీల ఉత్పత్తిని కూడా కేంద్రం ప్రోత్సహిస్తున్నది. తద్వారా దేశంలో విద్యుత్ వాహనాల శకం ప్రారంభమవుతుందని ఇప్పటికే చైనా, అమెరికా, జపాన్ లాంటి దేశాలతో పోలిస్తే దేశం బాగా వెనుకబడి ఉందని కేంద్రం అంటున్నది. విద్యుత్ కార్ల ఉత్పత్తిలో విదేశీ కంపెనీలతో పోటీ పడితే దేశీయ కంపెనీలు కూడా టెక్నాలజీ పెంచి కార్ల ధరలను కూడా తగ్గిస్తాయని కేంద్రం చెబుతున్నది. దిగుమతి సుంకాలు తగ్గితే విదేశీ కార్ల ధరలు కూడా దేశంలో 20 నుంచి 30 లక్షలకు క్రమంగా తగ్గవచ్చని ఆటోమొబైల్ కంపెనీలు కూడా అంటున్నాయి. మొత్తంగా టెస్లా ఎంట్రీతో ఆటోమొబైల్ స్వరూప స్వభావాలు సమూలంగా మారుతాయనడంలో సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News