Saturday, November 23, 2024

ఈ తెల్సా కథల ‘సంగతి’ విశేషమే!

- Advertisement -
- Advertisement -

తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా ( తెల్సా ) అనే సంస్థ 2019, 2022 లలో కథల, కవితల పోటీలు నిర్వహించింది. ఎంపికైన రచనలను ’సంగతి’ అనే వారి వెబ్ సమాచార సంచికలో ఒక లింక్ ద్వారా చదివే అవకాశాన్ని కలిగించింది. నగదు బహుమతులు పొందిన ఈ కథలు, కవితలు పుస్తకరూపంలో కూడా తెలుగు పాఠకులకు చేరాలనే ఆలోచనతో వారు ’సంగతి’ పేరిట రెండు సంకలనాలు తెచ్చారు. వీటిని అన్వీక్షకి పబ్లికేషన్స్ ప్రచురించింది. అమెరికాలోని తెల్సా వారి సూచనలు, హైదరాబాద్ లోని అన్వీక్షకి వారి ముద్రణా నాణ్యత కలగలిసి తెలుగులో కంటికింపైన రీతిలో ఈ పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. అచ్చుపరంగా అక్షరాలు, పేజీలు, పేరాలు ఇరుకిరుకు లేకుండా చదవడానికి ఆసక్తి కలిగేలా ఉన్నాయి. రచనలకే కాదు పుస్తక రూపానికి కూడా శైలి, శిల్పం ఉంటాయనడానికి ఇవి ఉదాహరణలు. సంగతి -2 విషయానికొస్తే ఇందులో ఈ పోటీల్లో ఎంపికైన రచనలలోని పదహారు కథలున్నాయి. పోటీ ప్రకటనలోని నియమాల ప్రకారం నిర్వాహకులు ఈ కథలను సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు అని విభజించారు. నిజానికి ఇవి కూడా పోటీకి వచ్చిన వందల కథల్లో జల్లెడ పట్టగా మిగిలిన మరియు వస్తు వైవిధ్యంలో, రచనా కౌశలంలో పటిమ గల అసాధారణ కథలే!
ఇందులో వసుంధర, సలీం, సుంకోజి దేవేంద్రాచారి,

ఎం సుగుణారావు, ఉమా మహేష్ ఆచాళ్ళ లాంటి సీనియర్ కథా రచయితలతో పాటు గాజోజు నాగభూషణం, బాడిశ హనుమంతరావు, నస్రీన్ ఖాన్ తదితర యువ కథకుల రచనలున్నాయి. తెల్సా ఎంచుకున్న లక్ష్యానికి సరిపడేలా ఈ కథలన్నీ తెలుగు ప్రాంతాలకు, జీవితానికి సంబంధించినవే. గ్రామీణ, పట్టణ, నగర మానవ జీవితాల్లోని పలు కోణాలను ఇవి స్పృశించాయనవచ్చు. ఈ కథల్లో శిల్ప పటిష్టత కథనానికి చక్కని బాట వేసింది. పాత్రోచిత సంభాషణలు సహజంగా అమిరాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో రాసిన కథల్లో స్థానిక భాష గుబాళించింది.ఈ కథల్లో ఏ ఒక్క దానికి మరో కథతో ఏమాత్రం దగ్గరితనం లేదు. రచనా పరంగా కూడా ఎవరి పంథా వారిదే. దాదాపు ఈ రచయితలందరు కథల పోటీల జాబితాలో పైనే కనబడేవారే! చాలా వరకు ఇప్పటికే కథా సంపుటాలు, నవలలు ప్రచురణ దాకా వెళ్లిన రచయితలు, రచయిత్రులు ఈ పోటీల్లో పాల్గొనడం విశేషమే.ఉయ్యూరు అనసూయ కథ ’అంగన’లో ట్రాన్స్ జెండర్ మనిషి వ్యక్తిగత ఘర్షణను చక్కగా చిత్రిస్తూ ఆ సమస్యను కుటుంబ సానుభూతితో ముగించడం బాగుంది. ’ఈ శిక్ష మాకొద్దు’ అంటూ బి.నర్సన్ తలారి జీవితాల్లోని వ్యథను కూలంకశంగా చర్చించారు. ఉరిశిక్షను అమలుచేసే చట్టపర విధానాలపై విస్తృత సమాచారం ఈ కథలో ఉంది.

గాజోజు నాగభూషణం రాసిన ’ఋణం’ కథలో అప్పులు, ఆర్థిక ఒత్తిళ్లకు సతమతమై రైతు తనకున్న భూమి అమ్ముదామనుకుంటే రికార్డుల్లో అది పాత యజమాని పేరు ఉంటుంది. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు రైతుకు ప్రాణాంతకమైతాయి. ఇది ధరణి ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాసినట్లుంది. వసుంధర రాసిన ’బృందావనమిది’ ఓల్ ఏజ్ హోమ్స్ ల ఆవశ్యకత, అనివార్యతను సానుకూలంగా చర్చించిన కథ. కథనం ఆసక్తిగా ఉంది. చారిత్రక ధీర వనితగా ’రాజవ్వ’ ను తీర్చిదిద్దిన కథ ఆసాంతం యుద్ధ వాతావరణంలో నడుస్తుంది. పొత్తూరి సీతారామరాజు రాసిన ఈ కథ నడిపిన తీరు, పాత్రల పేర్లు నేటివిటీకి ప్రతిబింబిస్తాయి. ’నీ నుంచి ఏమి ఆశించకుండా ప్రాజెక్ట్ ఎలా అప్పగించగలను?’ అన్న మెసేజి పంపిన పై అధికారికి ఆ మెసేజిలనే అస్త్రంగా బుద్ది చెప్పిన మహిళా ఉద్యోగి సాహసం ’హద్దులు ఆవల’ కథలో నస్రీన్ ఖాన్ బాగా చిత్రించారు. ’బండి తిండి కాదు భార్య వండిన తిండి తినండి’ అని కడయింటి కృష్ణమూర్తి తన ’చారు అన్నం’ కథలో ఇంటి రుచులు పంచారు. సలీం కథలను ఆయన పేరు లేకున్నా గుర్తుపట్టొచ్చు. అలాంటిదే ఇందులోని ’ధరిత్రి’ కథ. ఒంటరిగా పడుకొంటే నిద్ర పట్టని భర్తకు ఆ భయాన్ని ఎందుకు పోగొట్టవలసి వచ్చిందో అనే విషయం వెనుక సలీం మార్క్ ముగింపు ఉంటుంది.సమాధుల నుండే మాట్లాడే ఆత్మలతో రాజకీయ వ్యంగ్యాన్ని పండించిన కథ ’ఆత్మసాక్షిగా’.

పాత్రికేయుడైన సుంకోజి దేవేంద్రాచారి తన వృత్తిపర జీవిత నేపథ్యంతో ప్రయోగాత్మకంగా రాసిన కథ ఇది. ఇలా మిగతా కథలు కూడా ఏదో ఒక ప్రత్యేకత కలవే. ఇవన్నీ పోటీల్లో ఎంపికైన భిన్న రచయితల,రచయిత్రుల కథలు కాబట్టి ప్రతి కథకు సొంత దారి ఉంది. గ్రామీణ జీవితాల నుండి మధ్య తరగతి వరకు, కుటుంబ తగాదా నుండి సామాజిక సమస్య వరకు దేనికది కొత్తదనాన్ని కలిగివున్నాయి. కథలకు బొమ్మల విషయంలో తెల్సా సంస్థ ప్రత్యేక శ్రద్ద తీసుకుందనాలి. కథా సారాన్ని ఒడిసి పట్టినట్లు ఈ కథలకు చిత్రకారులు అన్వర్ మరియు ఉత్తయ్య బొమ్మలు వేశారు. కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు కథను ప్రోత్సహిస్తున్న తెల్సా ప్రయత్నం అభినందనీయం. అమెరికాలో ఉండి తెలుగు కథకు వారు చేస్తున్న సేవ, కృషి ఆదర్శనీయం.

పోటీల మరికొన్ని కథలు
పేజీలు 225 , వెల: రూ.225 /-
అన్వీక్షకి ప్రచురణ,
ప్రతులకు 9705972222

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News