న్యూఢిల్లీ : అమెరికా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ (ఇవి) సంస్థ టెస్లా భారత్ లోనే తన ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తే ఆ కంపెనీకే లాభాలు దక్కుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో పెట్రోలు వాహనాల కన్నా తక్కువ ధరకే అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. టెస్లా కంపెనీ తమ కార్లను భారత్‌లో ఉత్పత్తి చేస్తే తమకు ఎలాంటి సమస్య ఉండదని, కానీ ఆ కార్లను చైనా నుంచి మాత్రం ఆ కంపెనీ దిగుమతి చేయరాదని మంత్రి గడ్కరీ ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ భారత్ లోనే ఇవిలను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైతే ఏ సమస్య లేదని, ఆయన భారత్‌కు వచ్చి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించాలని, భారత్ పెద్ద మార్కెట్ అని, భారత్ నుంచే ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చని మంత్రి ఇటీవల పేర్కొన్నారు.