Monday, December 23, 2024

దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిందే: టీమిండియా ప్లేయర్లకు బిసిసిఐ హుకూం

- Advertisement -
- Advertisement -

ముంబై: టెస్టు క్రికెట్ టీమ్‌లో రెగ్యులర్ సభ్యులుగా ఉన్న క్రికెటర్లందరూ తప్పక దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) స్పష్టం చేసింది. ఆగస్టులో జరిగే ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కు టెస్టు జట్టు సభ్యులందరూ అందుబాటులో ఉండాలని బోర్డు సూచించింది. దేశవాళీ క్రికెట్‌పై నిర్లక్షం చూపే క్రికెటర్లపై కఠిన చర్యలకు సయితం వెనుకాడబోమని బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు బిసిసిఐ పెద్దలు క్రికెటర్లందరికీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

తాజాగా బిసిసిఐ కార్యదర్శి జైషా కూడా మంగళవారం ఈ విషయంలో ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా టెస్టు జట్టులో రెగ్యులర్ ఉండే ప్రతి ఆటగాడు దులీప్ ట్రోఫీకి అందుబాటులో ఉండాలని కోరారు. ఈ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి చూపని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జైషా హెచ్చరించారు. రానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో జట్టును మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు జైషా వెల్లడించారు. స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రాలకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చామన్నారు. ఈ ఆటగాళ్లు గాయల బారిన పడకుండా ఉండేదుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైషా పేర్కొన్నారు.

కాగా, ఈ ముగ్గురు దులీప్ ట్రోఫీలో ఆడాలంటే బోర్డుకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరించారు. ఆగస్టులో దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌కు తెరలేవనుంది. ఇలాంటి స్థితిలో బిసిసిఐ విడుదల చేసిన ప్రకటన క్రికెటర్లను ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ తదితరులపై బిసిసిఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా దులీప్ ట్రోఫీ ఆరంభానికి ముందు బిసిసిఐ స్పష్టమైన ఆదేశాల జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపిఎల్‌లో రాణించడం ద్వారా జాతీయ జట్టులో సులభంగా చోటు సంపాదించవచ్చని భావిస్తున్న క్రికెటర్లకు బిసిసిఐ తాజాగా తీసుకున్న నిర్ణయం ఒక హెచ్చరికలాంటిదేనని చెప్పాలి. ఐపిఎల్ ఆడాలంటే దేశవాళీ క్రికెట్‌లో ఆటను ప్రమాణికంగా తీసుకోవాలని బిసిసిఐ ఫ్రాంచైజీలను ఆదేశించే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు దేశవాళీ క్రికెట్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తాయి. అయితే భారత్‌లో మాత్రం ఐపిఎల్ వచ్చి తర్వాత దేశవాళీ క్రికెట్ రోజురోజుకు తీసికట్టుగా తయారవుతోంది. ఐపిఎల్ ద్వారా స్టార్ క్రికెటర్లుగా ఎదిగిన వారు దీన్ని పట్టించుకోవడం లేదు. ఇషాన్ కిషన్ వంటి క్రికెటర్లు అయితే బోర్డు ఆదేశాలను సయితం పెడచివన పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బిసిసిఐ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలనే లక్షంతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని టెస్టు క్రికెటర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News