Sunday, November 24, 2024

ఎల్లుండితో ముగియనున్న టెట్ దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

TET applications will close on Tuesday

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తులు మంగళవారం(ఏప్రిల్ 12)తో ముగియనున్నాయి. అయితే ఈసారి నిర్వహించే టెట్‌లో భాషా పండితుల కోసం పేపర్ 3ని నిర్వహిస్తారని అభ్యర్థులు భావించినప్పటికీ, ఇప్పటివరకు విద్యాశాఖ నుంచి ఎలాంటి పేపర్ 3కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. టెట్ దరఖాస్తు గడువు ముగుస్తున్నా ఇప్పటివరకు ప్రకటన వెలువడకపోవడంతో ఈసారి పేపర్ 3 ఉంటుందా..? ఉండదా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెట్‌లో ఇప్పటివరకు సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి)కి సంబంధించి పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి పేపర్-2 నిర్వహిస్తున్నారు.

అయితే ప్రత్యేక కోర్సులు చేసిన తెలుగు, హిందీ, ఉర్దూ లాంగ్వేజీ పండిట్ అభ్యర్థులు కూడా పేపర్ 2నే రాయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పేపర్‌లో పండిట్‌లకు సంబంధంలేని సబ్జెక్టులైన సాంఘిక శాస్త్రం, గణితం, సామాన్య శాస్త్రంకు సబ్జెక్టుల నుంచి 60 మార్కులు ఉండడంతో తాము టెట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నామని బాషా పండితులు వాపోతున్నారు. సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు రావడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని, తమ కోసం ప్రత్యేకంగా పేపర్ 3 నిర్వహించాలని భాషా పండితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము చదువుకున్న భాషా సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తే భవిష్యత్తులో విద్యార్థులకు బోధించడంలోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. తమ కోసం పేపర్- 3 నిర్వహించాలని భాషాపండిట్లు కోరుతున్నారు.

టెట్‌కు దరఖాస్తుల వెల్లువ

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. పేపర్ 1, పేపర్ 2కు కలిపి ఇప్పటివరకు దరఖాస్తులు 4 లక్షలు దాటినట్లు తెలిసింది. పేపర్ 1కు సుమారుగా 2.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా, పేపర్ 2కు 1.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. పేపర్ 1కు ఈసారి అభ్యర్థులు భారీగా పెరిగారు. బి.ఇడి అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు సవరించింది. ఇప్పటివరకు బి.ఇడి అభ్యర్థులు 6 నుంచి -10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు.అందుకు టెట్‌లో పేపర్- 2 రాసేవారు. బి.ఇడి అభ్యర్థులు కూడా 1- నుంచి 5 తరగతులకు బోధించేందుకు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమితులయ్యేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రస్తుతం బి.ఇడి అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశం లభించడంతో గతంలో టెట్‌లో పేపర్ 2 ఉత్తీర్ణులైన వారు సైతం పేపర్ 1 దరఖాస్తు చేసుకుంటున్నారు. దాంతో ఈసారి పేపర్ 1కు దరఖాస్తులు భారీగా పెరిగాయి.

దరఖాస్తు గడువు పొడిగింపు..?

టెట్ దరఖాస్తు గడువును పొడిగించే అవకాశం కనిపిస్తోంది. దరఖాస్తు గడువు పొడిగించాలని ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత టెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఒకవేళ టెట్ పేపర్ 3 నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తే భాషా పండితులు తమ దరఖాస్తులు సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. జూన్ 12వ తేదీన టెట్ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9.30 నుంచి 12.00 వరకు పేపర్ -1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షకు 33 జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News