రెండు సెషన్స్‌లో నిర్వహించనున్న అధికారులు
మూడు జిల్లాల పరిధిలో 83,465 మంది అభ్యర్థులు హాజరు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో నేడు జరిగే టెట్ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అభ్యర్ధులకు విద్యుత్, తాగునీరు సరఫరా వంటి సమస్యలు లేకుండా ముందుగానే చర్యలు తీసుకున్నారు. కేంద్రంలోని ప్రతిగదిలో బెంచీకి ఇద్దరు చొప్పున అభ్యర్థులు కూర్చునే విధంగా ఏర్పాటు చేయంతో పాటు ప్రతి సెంటర్‌కు 11మంది ఇన్విజిలేటర్లు, ముగ్గురు పర్యవేక్షకులను నియమించారు. పరీక్ష రెండు సెషన్‌లో ఉంటుందని పేపర్1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పేపర్2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. పరీక్షలకు విధులు నిర్వహించేందుకు ఉపాధ్యాయుల మినహా ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు హాజరుకానున్నారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో అభ్యర్ధులు హైదరాబాద్ జిల్లాలో 117 కేంద్రాలు 31,785మంది అభ్యర్థులు పర్యవేక్షకులు 1638 మంది, రంగారెడ్డి జిల్లాలో 164 సెంటర్లు 38,847మంది అభ్యర్ధులు, 2296మంది పర్యవేక్షకులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 55 కేంద్రాలు 12,833మంది అభ్యర్ధులు 770మంది పర్యవేక్షకులను నియమించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.