Monday, November 18, 2024

ఏటా రెండుసార్లు టెట్?

- Advertisement -
- Advertisement -

డిఎస్‌సి సంబంధం లేకుండా జూన్, డిసెంబర్‌లో పరీక్ష నిర్వహణ

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత (టెట్) పరీక్షను ఇక నుంచి ఏటా రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో టెట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఇక నుంచి డిఎస్‌సి నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఏటా రెండుసార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తారు. టెట్ నిర్వహణకు 90 రోజుల సమయం పట్టనుండగా, అంతకు ముందే నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిఆర్‌టి) ఏటా రెండుసార్లు టెట్‌ను నిర్వహించాలని ఆదేశించింది. అంతే కాకుండా టెట్ గడువును 7 ఏండ్ల నుంచి జీవితకాలానికి పొడగించింది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సైతం వారి స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా టెట్ రాస్తారు.

టీచర్లకు టెట్ తప్పనిసరి అనే నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత బి.ఇడి, డిఐఇడి కోర్సులను పూర్తిచేసిన వారు మాత్రమే టెట్ పరీక్ష రాశారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్ రాసి, అందులో ఉత్తీర్ణత పొందేవారు. కానీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు పేపర్ -2లో టెట్ ఉత్తీర్ణత పొందాలన్న నిబంధనను పాటించాల్సి ఉండటంతో ఇక నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం టెట్‌కు పోటీపడనున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు కూడా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన ఉంది. అయితే ఇప్పటివరకు అన్ని పాఠశాలలు టెట్ ఉత్తీర్ణతను పరిగణలోకి తీసుకోకపోయినా భవిష్యత్తులో టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించినా పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News