Wednesday, January 22, 2025

అంతర్జాతీయ హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పాఠశాలల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్లను ఆదివారం విడుదల చేశారు. సచివాలయంలో భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 20-25 ఎకరాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో పాఠశాలకు రూ. 25 నుంచి 26 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో ఉన్నాయని చెప్పారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే దగ్గర బోధన చేస్తున్నారని అన్నారు.

గత మూడు నెలలుగా రెసిడెన్షియల్ స్కూళ్లపై కసరత్తు చేశామన్నారు. ప్రస్తుత రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 662 స్కూళ్లకు పక్కా భవనాలు లేవని అన్ని అద్దె భవనాలేనని చెప్పారు. ఈ ఏడాది 5 వేల కోట్ల రూపాయలు రెసిడెన్షియల్ స్కూళ్లకు ఖర్చు చేస్తామని అన్నారు.. ఈనెల 11న సాధ్యమైనన్ని పాఠశాలలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఇప్పటికే 24 నియోజక వర్గాల్లో స్థలాలు ఎంపిక పూర్తయిందని అన్నారు. వీలైనంత త్వరగా ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 7నెలల్లో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. రెసిడెన్షియల్ పాఠశాల నియామకం సొసైటీ ద్వారా జరుగుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య : రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల అంశంపై ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం, మంత్రులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించాలని నిర్ణయించామని, వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, ఇవి దేశానికే ఆదర్శంగా ఉంటాయన్నారు. దసరా కంటే ముందే నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని, త్వరగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

రూ. 5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు : రాష్ట్రంలో ఐదువేల కోట్లతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం. మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బలహీన వర్గాలకు ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా పాఠశాలల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్లను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థులను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 5 వేల కోట్ల రూపాయలు రెసిడెన్షియల్ స్కూళ్లకు ఖర్చు చేస్తామని అన్నారు. కులమత, లింగ భేదం లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. పేద పిల్లలు తాము ఏదో మిస్సవుతున్నామని అనుకోకూడదని అన్నారు.

అవసరమైతే ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో స్మాల్ ఆంపీ థియేటర్ కడుతామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయా నియోజక వర్గాల్లో ఉండే ఉష్ణోగ్రతలు, గాలి వాటం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ ఆధునిక రెసిడెన్షియల్ భవనాల నిర్మాణం జరుగుతుందని వివరించారు. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు అన్ని వర్గాల వారు కలిసి ఒక చోట ఓ కుటుంబంలా చదువుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. కేవలం చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణ కాకుండా క్రీడలు, వినోదం వంటివి విద్యార్థులకు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఏ కొరత లేకుండా చూసే కార్యక్రమంలో భాగంగా థియేటర్ నిర్మించి శాటిలైట్ ద్వారా పిక్చర్స్ సైతం ప్రదర్శించే ఆలోచనలో ఉన్నామన్నారు. పేద వర్గాల వారు వారి బిడ్డలను ఈ పాఠశాలల్లో చేర్పించి విరివిగా ప్రచారం నిర్వహించాలని కోరారు.

రాష్ట్రంలో విద్యా విప్లవం సృష్టించబోతున్నాం : రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించి రాష్ట్రంలో విద్యా విప్లవం సృష్టించబోతున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న దసరా కానుక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని అన్నారు. రాష్ట్రంలో చదువుతున్న 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు కోసం ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదని, గత పది నెలలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాం కానీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు. రాష్ట్రంలో విద్యార్ధులు సౌకర్యాల లేమితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, 600 మంది విద్యార్ధులు 20 రూముల్లో ఉంటున్నారని, 20 మందికి ఒక టాయిలెట్ కూడా లేని పరిస్థితులున్నాయన్నారు.

రూ. 1100 కోట్ల వ్యయంతో అమ్మ ఆదర్శ పాఠశాలలు : బీ.సి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో ఇప్పటికే రూ. 1100 కోట్ల వ్యయంతో అమ్మ ఆదర్శ పాఠశాలల పధకాన్ని చేపట్టామని బీ.సి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏవిధమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టామన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్ర విద్యా రంగ చరిత్రలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక నూతన అధ్యాయమన్నారు. ఈ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, ఎన్. శ్రీధర్, ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News