త్వరలో పంపిణీకి ఏర్పాట్లు రేపు
సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం
హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్న
సిఎం రేవంత్‌రెడ్డి 90లక్షల
రేషన్‌కార్డులు… 2.5కోట్ల మంది
లబ్ధిదారులు అదనంగా మరో
30లక్షల మంది లబ్ధిదారులు
చేరవచ్చునని అంచనా ఏడాదికి
24లక్షల మెట్రిక్ టన్నుల
వినియోగం త్వరలో రెండు
రకాల రేషన్‌కార్డులు బిపిఎల్
కుటుంబాలకు మూడురంగుల
కార్డులు ఎపిఎల్ వారికి గ్రీన్‌కార్డులు
పౌరసరఫరాలశాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఉగాది పండుగ నుంచి రేషన్‌కార్డులు కలిగిన పేదలందరికీ సన్నబియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 30వ తేదీ ఉగాది పండుగ రోజునన హుజూర్‌నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ స్పెషల్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తో కలిసి మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు, 2.85 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని, వీరి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10,665 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే సన్నబియ్యంతో పాటు పప్పు, ఉప్పు లాంటి ఇతర నిత్యవసర వస్తువులు కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
దుర్వినియోగం అవుతున్న దొడ్డుబియ్యం
రేషన్ షాపుల్లో పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న దొడ్డు బియ్యం వినియోగించకపోవడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, అక్రమ వ్యాపారానికి పునాది అవుతుంది, డీలర్ల నుంచి బ్లాక్‌లో అక్కడక్కడా అమ్ముకుంటున్న ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టించని వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. దీనిని మార్చడానికి రాష్ట్రంలో పేదలు, నిరుపేదలకు నిజమైన ఆహార భద్రత కల్పించాలనే గొప్ప ఆలోచనతో రాష్ట్ర మంత్రివర్గం చర్చించి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో రేషన్ కార్డులు కలిగిఉన్న 80 నుంచి 84 శాతం జనాభాకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీకి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
పదేండ్లలో 49వేల కార్డులు జారీ
తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో 89 లక్షల 73వేల 708 కార్డులు కలిగిన 2.85కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని, గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కేవలం 49వేల 479 కొత్త కార్డులు మాత్రమే మంజూరు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం గత పది నెలల కాలంలో దానికి పదిరెట్లు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ధరఖాస్తులను తాము పరిశీలించి విచారణ చేసి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా వారి అర్హతను బట్టి సాచ్యురేషన్ మోడ్‌లో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, కొత్త రేషన్ కార్డు మంజూరి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని వివరించారు. కొత్త కార్డుల జారీ వల్ల అదనంగా 15 శాతం వరకు సన్నబియ్యం సరఫరా పెరుగుదల ఉండే అవకాశం ఉంటుందని దాంతో ప్రస్తుతం ఏడాదికి 24లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం డిమాండ్ కాస్తా 28 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశం ఉంటుందాని తెలిపారు.
ఫిజికల్ రేషన్ కార్డులు
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త ఫిజికల్ కార్డులు రెండు రకాలుగా ఉంటాయని, దారిద్య్రరేఖకు దిగువన(బిపిఎల్) కుటుంబాలకు మూడు రంగులతో కూడిన ఫిజికల్ రేషన్ కార్డు, దారిద్య్రరేఖకు ఎగువన(ఏపిఎల్) కుటుంబాలకు గ్రీన్ కార్డులు రూపొందించామని, వాటిని త్వరలో ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఫిజికల్ రేషన్ కార్డులలో చిప్ అంటూ ఏదీ ఉండదని, ఫిజికల్ రేషన్ కార్డుపై ప్రధాని నరేంద్రమోదీ బొమ్మ విషయంపై ఆలోచన చేద్దాం అని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచేనా రేషన్ సరుకులు తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. కార్డు ఉన్నా, లేకున్నా లబ్ధిదారుల వివరాలు జాబితాలో ఉంటే సన్న బియ్యం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తీసుకోవచ్చునని మంత్రి వివరించారు.
అదనపు భారంపై కేంద్రాన్ని కోరాం
పేదలకలు ఆహారభద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న అదనపు భారాన్ని కేంద్రం భరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను స్వయంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రం సంతృప్తివ్యక్తం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని అంగీకరించి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రభుత్వం రూ.500ల బోనస్ ఇచ్చి రైతుల నుంచి సన్నబియ్యం సేకరించి రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సిఐ)కి ఎప్పటిలాగా దొడ్డురకం బియ్యం సరఫరా కొనసాగుతుందని కమిషన్ చౌహాన్ వివరించారు.