Sunday, December 22, 2024

టెట్ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. అన్నట్టుగానే ప్రభుత్వం ఏడాదిలోనే రెండో సారి టెట్ నోటిఫికేషన్ ఇవ్వటం విశేషం. గత మే నెలలో తొలిసారి టెట్ పరీక్షలు జరుగగాగా, తాజాగా మరోమారు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరిలో టెట్ నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించనున్నారు.

టెట్ రాసేందుకు అర్హులైన అభ్యర్థులు మంగళవారం(నవంబర్ 5) నుంచి 20వ తేదీ లోపు టెట్ రాసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవి నరసింహారెడ్డి వెల్లడించారు. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్ http://schooledu.telanganga.gov.inలో మరింత సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే మే నెలలో ఒకసారి టెట్ నిర్వహించగా, తాజాగా మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆరు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించగా జనవరిలో జరిగేది ఏడోసారి కానుంది.

టెట్ రాసేందుకు అర్హత : టెట్ పేపర్-1కు డి.ఇడి, పేపర్ -2కు బి.ఇడి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా జనవరిలో పదోసారి జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.

ఇక నుంచి ఏటా రెండుసార్లు టెట్
ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత (టెట్) పరీక్షను ఇక నుంచి డిఎస్‌సి నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ఏటా రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏటా జూన్, డిసెంబర్ లేదా జనవరి నెలల్లో టెట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఏడాదిలోనే రెండో టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెట్ నిర్వహణకు 90 రోజుల సమయం పట్టనుండగా, అంతకు ముందే నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిఆర్‌టి) ఏటా రెండుసార్లు టెట్‌ను నిర్వహించాలి. అంతే కాకుండా టెట్ గడువును 7 ఏండ్ల నుంచి జీవితకాలానికి గతంలోనే ఎన్‌సిటిఇ పొడగించింది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సైతం వారి స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా టెట్ రాస్తారు.

ప్రైవేట్, ప్రభుత్వం టీచర్లకు టెట్ తప్పనిసరి అనే నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత బి.ఇడి, డిఐఇడి కోర్సులను పూర్తిచేసిన వారు టెట్ పరీక్ష రాశారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్ రాసి, అందులో ఉత్తీర్ణత పొందాలి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు పేపర్ -2లో టెట్ ఉత్తీర్ణత పొందాలన్న నిబంధనను పాటించాల్సి ఉండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం టెట్‌కు పోటీపడనున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు కూడా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన ఉంది. అయితే ఇప్పటివరకు అన్ని పాఠశాలలు టెట్ ఉత్తీర్ణతను పరిగణలోకి తీసుకోకపోయినా భవిష్యత్తులో టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించినా పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News