హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు, ఎల్లుండి గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయని.. అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నమ్మకం ఉంచి పరీక్షలు రాయండని ఆయన చెప్పారు. ఎవరి ఓఎంఆర్ షీట్ వారికే ఉంటుందని.. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ తప్పనిసరని టీజీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు. ఈసారి త్వరగానే ఫలితాలు ఇస్తామని అన్నారు. మొత్తం 1,368 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాగా.. 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 10-12.30, మధ్యాహ్నం 3- 5.30గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.