Friday, November 22, 2024

డిసెంబర్ 9 నుంచి గ్రూప్2 హాల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో వచ్చే నెల 15,16 తేదీలలో జరుగనున్న గ్రూప్ 2 హాల్ టికెట్లను డిసెంబర్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టిజిపిఎస్‌సి వెల్లడించింది. ఈ పరీక్షలకు మొత్తం నాలుగు పేపర్లు రాయాల్సి ఉండగా.. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 నిర్వహించనున్నారు. అలాగే రెండో రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -3, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 4 పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు.. ఆ తర్వాత అభ్యర్థులు పరీక్షా కంద్రాల్లో ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు. అభ్యర్థులు టిజిపిఎస్‌సి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని, అన్ని పేపర్ల ప్రశ్నాపత్రాలను నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రంగా పెట్టుకోవాలని సూచించింది. అవసరమైనప్పుడు హాల్‌టికెట్, ప్రశ్నపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. తర్వాత ఎలాంటి డూప్లికెట్ హాల్‌టికెట్ జారీ చేయమని కమిషన్ స్పష్టం చేసింది. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే పనిదినాలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040 23542185 లేదా 040 23542187 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని లేదా Helpdesk@tspsc.gov.inకు ఈమెయిల్ చేయాలి.

5.51 లక్షల దరఖాస్తులు
రాష్ట్రంలో గ్రూప్ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2022 డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కాగా, అప్పటినుంచి వేర్వేరు కారణాలతో పరీక్షలు పలుమార్లు వాయిదాపడింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించేందుకు టిజిపిఎస్‌సి ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, డిఎస్‌సి, గ్రూప్ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News