మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్‌కు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టిజిపిఎస్‌సి ప్రకటించింది. డిసెంబర్‌లో నిర్వహించే పరీక్షల తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. డిఎస్‌సి, గ్రూప్ 2 పరీక్షల మధ్య గడువు తక్కువగా ఉండటంతో ఒక పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు గతకొన్ని రోజులుగా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులతో సచివాలయంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్, గ్రూప్ 2 అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వం గ్రూప్ 2ను వాయిదా వేసింది.
ఛైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సిఎం భట్టి ఫోన్
టిజిపిఎస్‌సి చైర్మన్ మహేందర్‌రెడ్డికి డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఫోన్ చేశారు,. డిసెంబర్‌లో గ్రూప్ 2 నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అంతకుముందు గ్రూప్ 2 అభ్యర్థులతో చర్చించిన మంత్రి భట్టి విక్రమార్క పరీక్ష వాయిదాపై సానుకూలంగా స్పందించారు. గ్రూప్ 2 అభ్యర్థులతో చర్చల అనంతరం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గ్రూప్ 2 పరీక్ష వాయిదాను పరిశీలించాలని టిజిపిఎస్‌సి ఛైర్మన్‌ను ఆదేశించామన్నారు. డిసెంబరులో గ్రూప్ 2 నిర్వహణపై పరిశీలించాలని కోరామని తెలిపారు. మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని అన్నారు.ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అని, గత ప్రభుత్వం మొదటి పదేళ్లలో ఉద్యోగాల భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవని తెలిపారు.
కేసుల పాలైతే మీరే నష్టపోతరు..గ్రూప్ అభ్యర్థులతో భట్టి
విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కేసుల పాలైతే మీరే నష్టపోతారని నిరుద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడొద్దని అభ్యర్థులకు సూచించారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తామని చెప్పారు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు.
మా బిడ్డలు ఆర్థికంగా స్థిరపడాలి : సిఎల్‌పి నేతగా తాను, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే తమ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిదని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుందని, కానీ తాము అలా ఆలోచించడం లేదని చెప్పారు. తమ బిడ్డలు స్థిరపడాలి వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు.ఆన్‌లైన్‌లో కాంపిటేటివ్ పాఠాలు బోధన : హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారని భట్టి విక్రమార్క తెలిపారు.
ప్రివేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌లోనే ప్రశ్నలు వేయవచ్చు…అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇక నుంచి అశోక్‌నగర్‌లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన పనిలేదని చెప్పారు. నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తామని పేర్కొన్నారు. మీరు మా బిడ్డలు… రాష్ట్ర సంపద… మీ మేధస్సు నిరూపయోగం కావద్దనేదే ప్రభుత్వం ఆలోచన అని నిరుద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు వింటుంది…పరిష్కరిస్తోందని స్పష్టం చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని తెలిపారు.
వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది :అభ్యర్థులు
గ్రూప్ 2,3 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం అంగీకరించిందని అభ్యర్థులు తెలిపారు. డిసెంబరులో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించిందని వారు స్పష్టం చేశారు. అలాగే గ్రూప్ 2 పోస్టుల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు.
గ్రూప్ 3 వాయిదా..?
గ్రూప్ 3 పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1,388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17,18 తేదీలలో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 3 పరీక్షలను కూడా వాయిదా వేసి, పోస్టులకు పెంచిన తర్వాత పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో గ్రూప్ ఉద్యోగాలకు 5.51 లక్షల మంది, గ్రూప్ 3 పోస్టులకు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.