గ్రూప్- 2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
1,368 కేంద్రాల్లో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు
783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి నేడు, రేపు పరీక్షలు
ప్రతి ఒక్కరికీ బయోమెట్రిక్ తప్పనిసరి
ప్రశ్నా పత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్ పాయింట్లు
గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు వేగంగా ఇస్తాం: టిజిపిఎస్‌సి ఛైర్మన్ బుర్రా వెంకటేశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్ -2 పరీక్షలు ఆదివారం నుంచి మొదలు కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్ -2 పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16వ తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 1,368 పరీక్ష కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీ కోసం 29 డిసెంబర్ 2022న ప్రకటన విడుదల కాగా, 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కొన్ని సాంకేతిక కారణాలతో పరీక్షలు వాయిదా పడినా ఈసారి నిర్దిష్ట తేదీల్లో నిర్వహిస్తున్నారు. పరీక్షలు మొత్తం నాలుగు పేపర్లుగా ఉంటాయి. ప్రతి పేపర్ 150 మార్కులకు, మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్/తెలుగు, ఇంగ్లీష్/ఉర్దూ మీడియంలో ఉంటాయి.
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి: చైర్మన్ బుర్రా వెంకటేశం
గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని టిజిపిఎస్‌సి చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్ టికెల్, ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్ధులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలను పరిశీలించుకోవాలని సూచించారు.పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని పేర్కొన్నారు.
బయోమెట్రిక్ నమోదు కాని అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలను మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు. టిజిపిఎస్‌సి కార్యాలయంలో చైర్మన్ బుర్రా వెంకటేశం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు పకడ్బంధీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రూప్ 2 పరీక్షలు ఇప్పటికే నాలుగుసార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని, ఈసారి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. 5,51,847 మంది విద్యార్థులు గ్రూప్ 2 కోసం దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షల నిర్వహణకు 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. 58 రీజనల్ కో అర్దినేటర్లను నియమించామని చెప్పారు. పరీక్ష కోసం 65 వేల మంది సిబ్బంది వివిధ పనుల్లో నిమగ్నమయ్యారని వివరించారు. శనివారం మధ్యాహ్నం వరకు 75 శాతం అభ్యర్థులు హల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని అన్నారు.
అరగంట ముందే గేట్లు బంద్
గ్రూప్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయని చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లను మూసివేస్తామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు గత పది రోజులుగా అన్ని అంశాలను సమీక్షించామని చెప్పారు. పరీక్షలు సిసి కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని.. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నమ్మకం ఉంచి అభ్యర్థులు తమ ప్రతిభను నమ్ముకుని పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని, మెరిట్ ఉన్న వారిని ఎవరూ ఆపలేరని అన్నారు. అభ్యర్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. ప్రశ్నా పత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్ పాయింట్లు పెట్టామని వెల్లడించారు. ఓంఎఆర్ షీట్ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు వేగంగా ఇస్తాం
రాష్ట్రంలో 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైతే 2019 వరకు నియామక ప్రక్రియ పూర్తి కాలేదని చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు.ఈ సారి వేగంగా ఫలితాలు ఇస్తామని ప్రకటించారు. వీలైనంత త్వరగా ఫలితాలను ఇస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ 1 ఫలితాలు మార్చి వరకు ప్రకటిస్తామని తెలిపారు. ఇక నుంచి ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అభ్యర్థులకు టిజిపిఎస్‌సి సూచనలు ఇవే
హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో ఐడీ కార్డును అభ్యర్థులు తీసుకురావాలని టిజిపిఎస్‌సి తెలిపింది. హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా లేకపోతే అభ్యర్థి మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు గెజిటెడ్ అధికారి లేదా చివర చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపాల్ సంతకంతో తీసుకువచ్చి పరీక్షాహాల్‌లో ఇన్విజిలేటర్‌కు అప్పగించాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్, బ్లూ టూత్ డివైసెస్, జువెల్లరీ, సెల్‌ఫోన్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తదితర సామగ్రి అనుమతించరు. చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని, షూస్ వేసుకోవద్దని కమిషన్ సూచించింది. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ అనుమతించరు.
బయోమెట్రిక్ విధానం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు మెహందీ టాటూ వంటివి పెట్టుకోవదని టిజిపిఎస్‌సి సూచించింది. ప్రతి పేపర్ సమయంలో అభ్యర్థి ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌పై సంతకం పెట్టాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి నిర్దేశిత సమయానికంటే గంట ముందే చేరుకోవాలి. మోడల్ ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని సరిగ్గా బబుల్స్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఓఎంఆర్ షీట్‌ను సరిగా చెక్ చేసుకోవాలి. పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు పరీక్షా హాల్‌ను విడిచి వెళ్లవద్దు. టిజిపిఎస్‌సి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు మూసి వేస్తారు.
వివరాలు
గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాలు : 1368
ఛీఫ్ సూపరింటెండెంట్లు : 1368
33 జిల్లాల్లో రీజనల్ కో ఆర్డినేటరుల : 58
అబ్జర్వర్లు : 1556
ఇన్విజిలేటర్లు : 24420
బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు : 4130
జాయింట్ లోకల్ రూట్ ఆఫీసర్లు : 245
స్ర్కైబ్‌లు : 1383