Monday, January 20, 2025

గ్రూప్-2 కొత్త షెడ్యూల్ విడుదల 

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 15,16 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ పరీక్షలకు మొత్తం నాలుగు పేపర్లు రాయాల్సి ఉండగా.. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. మొత్తం 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

అయితే, డిఎస్‌సి, గ్రూప్ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్ -2 పరీక్షల తాజా షెడ్యూల్‌ను టిజిపిఎస్‌సి గురువారం ప్రకటించింది. రాష్ట్రంలో గ్రూప్ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2022 డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కాగా, అప్పటినుంచి వేర్వేరు కారణాలతో పరీక్షలు పలుమార్లు వాయిదాపడగా ఈసారి డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించేందుకు టిజిపిఎస్‌సి సిద్ధమవుతోంది.

రెండు సెషన్స్‌లో పరీక్షలు
గ్రూప్ 2 కొత్త షెడ్యూల్ ప్రకారం, రెండు సెషన్లలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయని టిజిపిఎస్‌సి కార్యదర్శి ఇ. నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ పరీక్షలు ప్రారంభానికి వారం రోజుల ముందునుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నుంచి నేటి వరకు వేర్వేరు కారణాలతో పరీక్షల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. దీంతో నిరుద్యోగ యువత గందరగోళానికి గురికావాల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News