Friday, March 7, 2025

ఎసిబి వలలో చౌటుప్పల్ విద్యుత్ శాఖ అధికారి

- Advertisement -
- Advertisement -

ఓ వ్యక్తి నుంచి రూ. 70 వేల లంచం తీసుకుంటూ ప్రత్యక్షంగా చౌటుప్పల్ విద్యుత్ శాఖ ఏడీఈ శ్యామ్‌ప్రసాద్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక పరిధిలోని తంగడపల్లి రెవెన్యూ పరిధిలో గల అక్రీట్ పరిశ్రమలో సోలార్ విద్యుత్ ప్లాంటు నిర్మాణం జరుగుతోంది. ప్లాంటు నుంచి పరిశ్రమకు విద్యుత్ వాడకం కోసం నూతన మీటర్ కనెక్షన్‌ను ఏడీఈ ఇవ్వాల్సి ఉంది. దీంతో సోలార్ ప్లాంటును నిర్మాణం చేస్తున్న సదరు కాంట్రాక్టర్ ఏడీఈ శ్యామ్ ప్రసాద్‌ను కలిశాడు. అందుకు ఏడీఈ పని పూర్తి చేయాలంటే రూ. 70 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. చేసేదేమీ లేక ఏడీఈకి అడిగినంత లంచం ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీని ఆశ్రయించి లంచం విషయాన్ని వారి దృష్టికి తీసుకవెళ్లాడు.

దీంతో రంగంలోకి దిగిన జిల్లా ఏసీబీ అధికారులు గురువారం చౌటుప్పల్‌లోని తంగడపల్లి రోడ్డులో గల విద్యుత్ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సోలార్ ప్లాంటు కాంట్రాక్టర్ ఏడీఈ శ్యామ్ ప్రసాద్‌కు రూ. 70 వేలను అందజేస్తుండగా వెంటనే పట్టుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డిఎస్‌పి జగదీష్ చందర్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు రామారావు, వెంకట్రావులు అవినీతికి పాల్పడిన ఏడీఈని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతడి వద్ద నుంచి రూ. 70 వేలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అదే సమయంలో మరో ఇద్దరు ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రఘనందన్, వెంకటేష్‌లు హైదరాబాద్‌లోని కొత్తపేట్‌లో గల ఏడీఈ శ్యాంప్రసాద్ నివాసంలోనూ సోదాలు జరిపారు. విచారణ అనంతరం లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏడీఈని నాంపల్లి కోర్టుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News