ముంబై :శివసేన, బిజెపి మళ్లీ కుమ్మక్కు అవుతున్నారన్న వదంతులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాక్రే కొట్టి పారేశారు. అసెంబ్లీ సమావేశాల ముగింపులో విపక్షం వ్యవహరించిన తీరుపై ధ్వజమెత్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత థాక్రే నాయకత్వం లోని శివసేన, బిజెపిలు మళ్లీ ఏకమవుతున్నాయని ఊహాగానాలు గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గత 30 ఏళ్లుగా తాము కలిసి ఉన్నప్పుడు ఏమీ జరగలేదని, అలాంటప్పుడు ఇప్పుడేం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి శాసన సభ్యుల చర్యలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని వ్యాఖ్యానించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కారణంపై సోమవారం 12 మంది బిజెపి ఎంఎల్‌ఎలను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.