బ్యాంకాక్: దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, కొవిడ్ వ్యాక్సిన్ నిబంధనలను ఉల్లంఘించారని, మానవ హక్కులను దుర్వినియోగం చేశారని, అవినీతిని పెంచిపోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న థాయ్‌ల్యాండ్ ప్రధాని ప్రయుత్ చన్-ఓచా శనివారం పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస పరీక్షలో నెగ్గారు. తొమ్మిది మంది మంత్రులు కూడా బల పరీక్షలో విజయం సాధించారు. 2014లో సైన్యాధ్యక్షుడిగా తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న ప్రయుత్ 2019 జులైలో జరిగిన పార్టమెంట్ ఎన్నికలలో గెలుపొంది ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టారు.
ఆయన ప్రభుత్వం ఎదుర్కొన్న రెండవ విశ్వాస పరీక్ష ఇది. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రయుత్, ఆయన మంత్రివర్గ సహచరులు ఐదుగురు దిగువ సభలో జరిగిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో గెలుపొందారు. తన ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై నియంతలా వ్యవహరిస్తూ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ఆరోపిస్తూ ప్రయుత్‌కు వ్యతిరేకంగాగత ఏడాది కాలంగా దేశంలో విద్యార్థి ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రయుత్, ఆయన ప్రభుత్వం దిగిపోవాలని విద్యార్థులు ఆందోళన సాగిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామిక, జవాబుదారీ పాలన ఏర్పడేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.